కేటీఆర్ హెచ్చరించిండు.. జనగామ టికెట్​ నాదే : ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

 ‘‘ఇద్దరు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను కేటీఆర్ కట్టడి చేసిండు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న జనగామకు వెళ్లి డిస్టర్బ్ చేయొద్దని హెచ్చరించిండు. మూడోసారి టికెట్ నాదే.. గెలుపూ నాదే” అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని తన క్యాంపు ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. మరో నాలుగేండ్లు పదవీకాలం ఉన్న ఎమ్మెల్సీలు జనగామకు వెళ్లి పార్టీ శ్రేణులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని  కేటీఆర్ మందలించాడన్నారు. 

అందులో భాగంగానే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీటింగ్ అర్ధాంతరంగా ముగిసిందన్నారు. ఇన్నాళ్లు తెరచాటు రాజకీయాలు చేసిన పల్లా నిడిగొండ ఫంక్షన్ హాల్​లో బాహాటంగా మీటింగ్ పెట్టడాన్ని కేటీఆర్ సీరియస్​గా తీసుకుని వార్నింగ్​ ఇచ్చిండన్నారు. డబ్బులు ఇచ్చి నియోజకవర్గ లీడర్లను పల్లా మలినం చేశాడన్నారు. తప్పు పల్లాదని తమ లీడర్లది కానేకాదన్నారు. పల్లా దగ్గరికి వెళ్లిన వారంతా తన అనుచరులేనని వారిని ఎటువంటి ఇబ్బంది పెట్టనని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అందరం కలిసి పని చేసుకుందామన్నారు. 

సిట్టింగ్ అయిన తనకే టికెట్ రావడం ఖాయమైందని పార్టీ లీడర్లు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని కోరారు. ఈ నెల 15న సీఎం కేసీఆర్ జనగామ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరావాలని కోరారు. సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శంగా తెలంగాణను డెవలప్​ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదని, మూడో సారి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్​ బాల్దె సిద్ధిలింగం తదితరులు  ఉన్నారు.