భారతీయ రైల్వే శాఖ పని తనం బట్టబయలైంది. ట్రైన్ స్ట్రార్ట్ చేసి కొద్ది దూరం వెళ్లగానే రైలుకున్న బోగీలు ఊడిపోయాయి. అవును మీరు చదివింది నిజమే ట్రైన్ బోగీలు ఊడిపోయాయి. ఇంతకు ఎక్కడనుకుంటున్నారా.. అయితే పూర్తిగా చదవండి..
జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. విశాఖపట్నం నుంచి లింగంపల్లికి నడిచే ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరిన కొద్దిసేపటికే ఆగిపోయింది. విశాఖ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం నుంచి ప్రారంభమైన రెండు నిమిషాలకే ఎర్రజెండా ఊపాల్సి వచ్చింది. ఆ రైలులోని ఏసీ బోగీల లింకు తెగిపోవడంతో ఆగిపోవాల్సి వచ్చింది.
ఉదయం 6.20కు విశాఖపట్నంలో బయల్దేరాల్సిన రైలు సమయానికే రైలు బయల్దేరినప్పటికీ 2 నిమిషాలకే ఏసీ బోగీ లింక్ ఊడిపోయింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది.. రైలును మళ్లీ విశాఖ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సాంకేతిక సమస్యతో 2 బోగీలు రైలు నుంచి విడిపోయాయని అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించాక రైలును పంపిస్తామని చెప్పారు.
దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైలు రన్నింగ్ లో ఉండగా ఏసీ బోగీలు ఊడి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరమ్మతులు చేసిన అనంతరం జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖ నుంచి బయల్దేరింది.