
సికింద్రాబాద్: లింగంపల్లి నుంచి విశాఖపట్నానికి, విశాఖపట్నం నుంచి లింగంపల్లికి రాకపోకలు సాగించే జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలుకు(ట్రైన్ నంబర్ 12805/06) ఇకపై సికింద్రాబాద్ స్టాప్ లేదు. ఈ రైలుకు సికింద్రాబాద్ స్టాప్ను రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. జన్మభూమి ఎక్స్ ప్రెస్ను శాశ్వతంగా చర్లపల్లి-అమ్ముగూడ-సనత్ నగర్ మీదుగా మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఏప్రిల్ 25 నుంచి జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ఈ మార్గంలోనే హైదరాబాద్ సిటీలో రాకపోకలు సాగించనుంది. ఈ కారణంగా.. ఇన్నాళ్లు సికింద్రాబాద్, బేగంపేట్ స్టేషన్లలో ఆగిన ఈ రైలు.. ఈ రెండు రైల్వే స్టేషన్లకు పూర్తిగా దూరమైందనే చెప్పక తప్పదు.
ఏప్రిల్ 25 నుంచి ట్రైన్ నంబర్ 12805 విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్ విశాఖపట్నంలో ఉదయం 6 గంటల 20 నిమిషాలకు బయల్దేరి చర్లపల్లి రైల్వే స్టేషన్కు అదే రోజు సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు చేరుతుంది. చర్లపల్లిలో ఐదు నిమిషాల పాటు ఈ రైలు ఆగుతుంది. 6 గంటల10 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయల్దేరి 7 గంటల 40 నిమిషాలకు లింగంపల్లికి చేరుతుంది.
ఇక.. లింగంపల్లి వైపు నుంచి వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్ (ట్రైన్ నంబర్ 12806) ఏప్రిల్ 26 ఉదయం 6 గంటల 15 నిమిషాలకు లింగంపల్లి నుంచి బయల్దేరి 7 గంటల 15 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది. చర్లపల్లి నుంచి 7 గంటల 20 నిమిషాలకు బయల్దేరి అదే రోజు రాత్రి 7 గంటల 45 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
జన్మభూమి రైలును చర్లపల్లికి మళ్లించడంపై ప్రయాణికుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. చర్లపల్లి రైల్వే స్టేషన్కు సరైన రోడ్డు లేకపోవడంతో స్టేషన్వరకు బస్సులు నడిపే పరిస్థితి లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రైల్వే శాఖ దాదాపు రూ.430 కోట్లతో చర్లపల్లిలో శాటిలైట్టెర్మినల్ నిర్మించింది. దీన్ని ప్రారంభించాక పలు రైళ్లను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కాకుండా చర్లపల్లి నుంచి నడుపుతున్నారు. దీంతో రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read:-PhonePe, GPay లకు దడపుట్టిస్తున్న Flipkart సూపర్ మనీ యాప్...
వీరి కోసం ఆర్టీసీ చర్లపల్లి రైల్వేస్టేషన్వరకు బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నా..అక్కడి వరకూ నేరుగా అప్రోచ్రోడ్ లేకపోవడంతో బస్సులు వెళ్లే పరిస్థితి లేదు. రైల్వే స్టేషన్పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ 30 అడుగుల వెడల్పుతో ఉండడంతో బస్సులు రైల్వేస్టేషన్వరకూ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం సికింద్రాబాద్స్టేషన్నుంచి చర్లపల్లికి 250సి బస్సు నడుపుతున్నా సరైన రోడ్డు లేక అది చర్లపల్లి బస్స్టేషన్వరకే వెళ్తోంది.