Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేత సిన్నర్.. ఫైనల్లో జ్వెరేవ్‌ చిత్తు

Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేత సిన్నర్.. ఫైనల్లో జ్వెరేవ్‌ చిత్తు

ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను టాప్ సీడ్ సిన్నర్ దక్కించుకున్నాడు. ఆదివారం(జనవరి 26) జరిగిన ఫైనల్లో అలెగ్జాండ‌ర్‌ జ్వెరేవ్‌ పై  వరుస సెట్లలో గెలిచి ఛాంపియన్ గా అవతరించాడు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో 6-3, 7-6(7-4), 6-3 తేడాతో జ్వెరేవ్‌ ను మట్టికరిపంచాడు. సిన్నర్ కు ఇది వరుసగా రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ కావడం విశేషం. 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మెద్వదేవ్ పై 5 సెట్లలో పోరులో సిన్నర్ విజయం సాధించాడు. ఓవరాల్ గా సిన్నర్ కెరీర్ లో ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. అంతకముందు 2024లో ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచాడు. 

టాప్ సీడ్ గా ఎన్నో అంచానాలు మధ్య ఈ టోర్నీలో బరిలోకి దిగిన సిన్నర్..ఫైనల్లో కూడా అదే జోరును కొనసాగించాడు. తొలి సెట్ లో ఎనిమిదో గేమ్ లో జ్వెరేవ్‌ సర్వీస్ బ్రేక్ చేసి 5-3 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. పదో గేమ్ లో తన సర్వీస్ నిలబెట్టుకొని 6-4 తేడాతో తొలి సెట్ నెగ్గాడు. రెండో సెట్ లో జ్వెరేవ్‌ ప్రతిఘటించడంతో సెట్ టై బ్రేక్ కు దారి తీసింది. టై బ్రేక్ లో 4-4 తో సమంగా ఉన్నపుడు కీలక దశలో సిన్నర్ వరుసగా మూడు పాయింట్స్ గెలిచి రెండో సెట్ కైవసం చేసుకున్నాడు. మూడో సెట్ లోనూ సిన్నర్ హవా కొనసాగింది. ఆరో గేమ్ లో జ్వెరేవ్‌ సర్వీస్ బ్రేక్ చేసి 4-2 ఆధిక్యంలోకి వెళ్ళాడు. చివరి రెండు తన సర్వీస్ లను నిలబెట్టుకొని 6-4 తేడాతో సెట్ తో పాటు మ్యాచ్ ను.. టైటిల్ ను గెలుచుకున్నాడు. 

ALSO READ | Women's U19 World Cup: అండర్‌-19 ప్రపంచకప్‌‌.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా

మరోవైపు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ అందుకోవాలని ఆశించిన జ్వెరేవ్‌ కు నిరాశ తప్పలేదు. ఫైనల్ కు చేరే క్రమంలో అద్భుతంగా ఆడిన ఈ జర్మన్.. ఫైనల్లో తేలిపోయాడు. ఈ మ్యాచ్ లో సిన్నర్ మొత్తం 6 ఏస్ లు కొడితే.. జ్వెరేవ్‌ ఏకంగా 12 ఏస్ లు కొట్టడం విశేషం. అయితే మ్యాచ్ లో పదే పదే అనవసర  తప్పిదాలు చేస్తూ జ్వెరేవ్‌ మూల్యం చెల్లించుకున్నాడు. మ్యాచ్ మొత్తం లో సిన్నర్ రెండు సార్లు జ్వెరేవ్‌ సర్వీస్ బ్రేక్ చేశాడు.