పుట్టేటప్పుడు కన్నతల్లికి కూడా నొప్పి ఇవ్వకుండా పుట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్: నాగబాబు

పుట్టేటప్పుడు కన్నతల్లికి కూడా నొప్పి ఇవ్వకుండా పుట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్: నాగబాబు

పిఠాపురం: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరిగింది. ‘జయకేతనం’ పేరుతో జరిగిన ఈ బహిరంగ సభలో ఎమ్మెల్సీ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుట్టేటప్పుడు కన్నతల్లికి కూడా నొప్పి తెలియకుండా పుట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని, అలాంటి నాయకుడు ప్రజలకు ఎందుకు బాధలు రానిస్తాడని మెగా బ్రదర్ నాగబాబు వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్సీ నాగబాబు వ్యాఖ్యలు యథాతథంగా..
‘‘మొన్నీమధ్యన మా అమ్మ గారితో మాట్లాడుతున్నప్పుడు మా కల్యాణ్ బాబు గురించి ఒక మాటొచ్చింది. ఒక అన్నగా ఈ ఒక్క విషయం చొరవ తీసుకుని మాట్లాడాలి. మా అమ్మను అడిగాను. ఆవిడ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటది. ఆవిడను అడిగా. ఏదో మాటల్లో వచ్చింది. నేను పుట్టినప్పుడు ఏమైనా పెయిన్స్ అనుభవించావా అని మా అమ్మను అడిగాను. అప్పుడు మా అమ్మ ఇలా అన్నది. నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించినంత పెయిన్స్ భూమ్మీద ఏ ఆడది అనుభవించి ఉండదురా.. అంత కష్టపెట్టావ్. అని మా అమ్మ నా గురించి చెప్పింది. మరి కల్యాణ్ బాబు ఎలాగా అని అమ్మను అడిగాను. అప్పుడు మా అమ్మ చెప్పింది విని షాకయ్యాను. వాడు పుట్టినప్పుడు కొంచెం కూడా నాకు పెయిన్ తెలియలేదురా. నాకు పెయిన్ లేకుండా, పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు. అని మా అమ్మ అంది.’’

‘‘సో.. నేను ఏమంటానంటే.. పుట్టేటప్పుడు కన్నతల్లికి కూడా ఏమాత్రం నొప్పి, బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కల్యాణ్ లాంటోడు, అలాంటి నాయకుడు, ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు, ప్రజలకు ఎందుకు బాధలు రానిస్తాడు. వాళ్లకు ఏ బాధలు, కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. అది మనం ఈరోజు చూస్తున్నాం’’ అని నాగబాబు తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.