జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం ...ఆడ బాలికలకు బంగారు భవితనిద్దాం

జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం ...ఆడ బాలికలకు బంగారు భవితనిద్దాం

ఎదిగే హక్కు బాలుడితోపాటు బాలికకు  సమానంగా ఉంది.  కానీ, ఇది ఆచరణలో అమలుకావడం లేదు. తల్లిగర్భంలో నలుసుగా పడింది మొదలు మన దేశంలో ఆడబిడ్డ ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బాలికల పట్ల కొనసాగుతున్న వివక్షను తొలగించి, వారి సమగ్రాభివృద్దే లక్ష్యంగా 2009 నుంచి ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికాదినోత్సవం జరుపుకుంటున్నాం. 

దేశంలోని బాలికలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి, తగిన అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జనవరి 24న కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ చొరవతో జాతీయ బాలికా దినోత్సవాన్ని పాటిస్తున్నారు. బాలికల హక్కులపై అవగాహన కల్పించడం, బాలికా విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారాలకు ప్రాముఖ్యం ఇవ్వడం కూడా బాలికా దినోత్సవం లక్ష్యాలు.   

మన దేశంలో  దేవతలకు  పూజలు చేస్తున్నా.. ఇంట్లో బాలికపై వివక్షాపూరిత సంస్కృతి తరతరాల నుంచి కొనసాగుతోంది. మగపిల్లవాడు  వంశోద్ధారకుడనే సామాజిక అపోహల వల్ల మగపిల్లలకు ప్రాధాన్యత పెరిగి లింగ నిష్పత్తి  గాడి తప్పుతోంది. 2001 జనాభా లెక్కలు ప్రకారం జాతీయస్థాయిలో బాలబాలికల లింగ నిష్పత్తి 1000:927 కాగా...అది 2011 నాటికి 1000:914 పడిపోయింది. 

ఎన్​హెచ్ఎఫ్​ఎస్​5 ప్రకారం  భారతదేశంలో 23 శాతం బాల్యవివాహాలు జరుగుతున్నట్టు పేర్కొన్నది.  పశ్చిమ బెంగాల్,  బిహార్ రాష్ట్రాలలో 41శాతం బాల్య వివాహాలు జరుగుతున్నవి.    బాలికలకు బాల్య వివాహాల నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కడం లేదు.  లింగ నిర్ధారణ పరీక్షలు,  భ్రూణహత్యలు చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. తద్వారా  జన్మనిచ్చే మహిళే  జన్మించే హక్కును కోల్పోవడం జరుగుతోంది. 

పేదరికం, నిరక్షరాస్యత,  బాల్య వివాహాలు, అక్రమరవాణా.. బాలిక సాధికారతకి గొడ్డలిపెట్టుగా మారాయి.  బాలికలు అత్యాచారాలకు,  లైంగిక వేధింపులకు బలవుతున్నారు. ఇటీవల చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో) కింద కేసులు దేశవ్యాప్తంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

యునెస్కో రిపోర్టు

పలువురు భారతీయ మహిళలు ప్రపంచ నాయకులుగా విభిన్న రంగాలలో శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ దేశంలోని చాలామంది మహిళలు, బాలికలు లోతుగా పాతుకుపోయిన పితృస్వామ్య అభిప్రాయాలు, నిబంధనలు, సంప్రదాయాల నుంచి విముక్తి కాలేకపోతున్నారని యునెస్కో స్పష్టం చేసింది. తద్వారా తమ హక్కులను పూర్తిగా అనుభవించలేకపోతున్నారని పేర్కొన్నది.  

బాలబాలికల సాధికారతకు సమానంగా మద్దతు ఇస్తే తప్ప భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెందదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో బాలికల హక్కులను కాపాడటంలో మొదట బాలికా విద్యను ప్రోత్సహించాలి.  జాతీయ విద్యా విధానం-2020లో బాలిక అభివృద్ధికి లింగ సమ్మిళిత నిధి( జెండర్​ ఇంక్లూసివ్​ ఫండ్)ని  ప్రవేశపెట్టింది.  

ఇది నాణ్యమైన, సమానత్వంతో కూడిన విద్యను అందించడంలో ఎంతో తోడ్పడుతుంది. బాలికా సంక్షేమం నిధులతో  ముడిపడి ఉంది. ఇప్పటివరకు వారికోసం పలు పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ అమలుకు నిధుల సమస్య వెంటాడుతోంది.  ‘బేటీ బచావో- బేటీ పఢావో’  ప్రభుత్వ నినాదమే కాదు మన అందరి నినాదం కావాలి.

విశ్వాసం పెంచాలి

పౌర సంస్థలు, ప్రభుత్వం.. బాలికల హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ వారి అభివృద్ధికి చిత్తశుద్ధితో  కృషి చేయాలి.  తల్లిదండ్రులు ఆడపిల్లలను సంస్కృతీ సంప్రదాయాల పరిధిలో బంధించి వారి సాధికారతను అడ్డుకోవద్దు. అబ్బాయిలతో  సమానంగా అమ్మాయిలకు విద్యావకాశాలను కల్పించి ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రోత్సహించాలి. 

అప్పుడే ఆడపిల్లల పట్ల వివక్ష తొలగిపోయి రాజ్యాంగం సూచించిన లింగ సమానత్వం సాధ్యమవుతుంది. బాలికలకు సమాజంలో రక్షణ ఉందనే నమ్మకాన్ని కల్పించే బాధ్యత ప్రభుత్వం, పౌర సమాజం తీసుకోవాలి. అందుకే, ఆడపిల్లల ఉన్నతికి సహకరిద్దాం అనే నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలి.

- సంపతి రమేశ్ మహరాజ్, సోషల్​ ఎనలిస్ట్​-