ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజున పర్యాటక ప్రదేశాల విశిష్టత గురించి వాటి అభివృద్ధి గురించి తెలియజేయడం జాతీయ పర్యాటక దినోత్సవ ప్రధాన ఉద్దేశం.
చారిత్రక ప్రదేశాలను సందర్శించడం, విహార యాత్రలు చేయడం వల్ల విజ్ఞానం, వినోదం రెండూ కలుగుతాయి. లోకజ్ఞానం పెరుగుతుంది. పర్యాటక యాత్రల వలన జాతీయ సమైక్యత, వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది.
చారిత్రక ప్రదేశాల కట్టడాలు ఆనాటి నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం సందర్శకులను ఆలోచింపచేస్తుంది. ఆ కాలంలో నిర్మించిన దేవాలయలన్నీ కూడా ఎత్తయిన శిఖరాలపై నిర్మించడం జరిగింది. వీటి నిర్మాణం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో భారీ బరువులను ఎత్తే యంత్రాలు లేకున్నా నేటికీ చెక్కుచెదరకుండా నిర్మించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వేయిస్తంభాల దేవాలయం రామప్ప దేవాలయం, నల్ల రాతి నంది ఎంతో ఆలోచింప చేస్తున్నది. పర్యాటక రంగం వల్ల ప్రత్యేకంగా ఉద్యోగ, ఉపాధులు లభిస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా టూరిజం శాఖ ద్వారా ఆదాయం సమకూరుతుంది.
ఈ విధంగా పలు ప్రయోజనాలు చేకూరుస్తున్న పర్యాటకాన్ని భారత ప్రభుత్వం ఓ పరిశ్రమగా గుర్తించింది. ప్రత్యేకంగా ఇన్క్రెడిబుల్ ఇండియా నినాదంతో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతోంది. కొత్త పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల ఆయా రాష్ట్రాలకు కూడా పర్యాటక కేంద్రాల వల్ల ఆదాయం సమకూరుతోంది.
అయితే, పెరుగుతున్న వాతావరణ కాలుష్యం వల్ల చారిత్రక కట్టడాలు రూపురేఖలు మారి అందవిహీనంగా అవుతున్నాయి. ఇటీవలే ఢిల్లీ నగరం కాలుష్యంతో అక్కడి చారిత్రక ప్రదేశాలు దెబ్బతిన్నట్లుగా గుర్తించారు.
ALSO READ : రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్‌మహల్ యమునా నదికి దగ్గరలో పాలరాతితో నిర్మించారు. దీని పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి పర్యాటకులు మన దేశంలోని టూరిస్ట్ ప్లేస్‌లను సందర్శిస్తున్నారు. జాతీయ ఆదాయం పెరగటానికి దోహదం చేస్తున్న టూరిజం, పర్యాటక ప్రదేశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా ఉంది.
-సయ్యద్ షఫీ, హనుమకొండ.