- ప్రాథమికంగా నిర్ధారించిన ఆఫీసర్లు
- ఇరిగేషన్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఫీల్డ్ విజిట్
- బుల్కాపూర్ నుంచి గోపులారం, జన్వాడ మీదుగా మణికొండకు ఫిరంగి నాలా
- మరోసారి జాయింట్ సర్వే చేస్తామని ప్రకటన
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలోని కేటీఆర్ఫామ్హౌస్పరిసరాలను మంగళవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్తేజ, సర్వేయర్ సాయి, ఇరిగేషన్ శాఖ సూపర్ వైజర్లింగం పరిశీలించారు. కేటీఆర్ ఫామ్హౌస్ముందు భాగం నుంచి వెళ్తున్న ఫిరంగి నాలాను (ఫిరంగి కాల్వ) పరిశీలించారు. నాలాకు సంబంధించి 9 ఫీట్ల నుంచి 27 మీటర్ల వరకు కబ్జా చేసినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తున్నది. నాలా పరిధిలోకి ఏయే సర్వే నంబర్లు వస్తున్నాయో.. డేటా తీసుకుంటున్నామని, పూర్తి స్థాయి సర్వే తర్వాత ఎంత ఆక్రమణకు గురైందో తెలుస్తుందని వెల్లడించారు. రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేస్తామని మండల రెవెన్యూ ఆఫీసర్ తెలిపారు.
నాలా కబ్జా చేసి నిర్మాణం
అప్పట్లో గండిపేట జలాశయానికి వచ్చే వరద ఉధృతిని కంట్రోల్ చేయడానికి నీటిని దారి మళ్లించి కాల్వ ద్వారా మోకిలా–బుల్కాపూర్–గోపులారం–జన్వాడ మీదుగా మణికొండ మీదుగా కోకాపేట్–నార్సింగి–పుప్పాలగూడ –షేక్‌పేట –హకీంపేట, ఖైరతాబాద్ మీదుగా హుస్సేన్‌సాగర్‌లో కలిసేవి. ఇది 24 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. అయితే, జన్వాడ కేటీఆర్ ఫామ్‌హౌస్ పక్క నుంచే ఫిరంగి నాలా (బుల్కాపూర్ కత్వా) ప్రవహిస్తున్నది. ఈ ఫిరంగి కాల్వను ఆక్రమించి ఫామ్‌హౌస్ నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. నాలాకు 9 మీటర్ల వరకు బఫర్జోన్ఉన్నట్టు నిర్ధారించారు.
బఫర్‌జోన్‌లో ఎలాంటి కట్టడాలు ఉండకూడదని నిబంధన ఉన్నా ప్రహరీ కట్టి గేటు ఏర్పాటు చేశారు. నాలాలో ఫామ్ హౌస్ ప్రహరీ, గేటు, కొంత మేర కాల్వ, బఫర్ జోన్ ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో విమర్శలు వెల్లువెత్తడంతో 2020లోనే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వే చేసి రూల్స్బ్రేక్చేశారని తేల్చారు. నాలాను కబ్జా చేసిన్నట్లు అధికారులు రిపోర్ట్ సిద్ధం చేసినా చర్యలు తీసుకోలేదు. మంత్రిగా ఉన్నప్పుడే కేటీఆర్ఈ ఫామ్‌హౌస్‌లో ఉండేవారు. ఫామ్‌హౌస్ చుట్టూ కేటీఆర్ భార్య శైలిమ సన్నిహితులకు సంబంధించిన భూములున్నట్టు తెలుస్తున్నది.
గతంలో ఫిరంగి నాలా 50 మీటర్ల వరకు ఉండేదని, కానీ కబ్జాలతో ప్రస్తుతం 18 నుంచి 20 మీటర్ల వరకు కుచించుకుపోయిందని స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శంకర్పల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్, ఇరిగేషన్ సూపర్ వైజర్ కేటీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఫిరంగి నాలాను పరిశీలించారు. త్వరలోనే సంయుక్తంగా రెవెన్యూ, ఇరిగేషన్సర్వే నిర్వహిస్తామని ఆర్ఐ తేజ తెలిపారు.
మూడుసార్లు పరిశీలించిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
ఫిరంగి నాలాను ఆక్రమించి జన్వాడ ఫామ్హౌస్కట్టారనే ఆరోపణలు రావడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఇప్పటికే మూడు సార్లు పరిశీలన జరిపారు. ఫామ్‌హౌస్ కు మూడు గేట్లు ఉండగా.. ఫామ్హౌస్తూర్పు గేటు ఫిరంగి నాలాను కబ్జా చేసి కట్టారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వాస్తవానికి ఫిరంగి నాలాకు 9 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. కానీ, కేటీఆర్ మిత్రుడిది అని చెబుతున్న ఫామ్‌హౌస్ ఏకంగా 40 ఫీట్లు కబ్జా చేసి, కాంపౌండ్ వాల్ కట్టి గేట్ పెట్టినట్లు తెలిసింది.