అడ్వొకేట్ సమక్షంలోనే విజయ్​ను ఎంక్వైరీ చేయండి

అడ్వొకేట్ సమక్షంలోనే విజయ్​ను ఎంక్వైరీ చేయండి
  • పోలీసులను ఆదేశించిన హైకోర్టు
  • జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: జన్వాడ ఫామ్‌‌ హౌస్‌‌ పార్టీ కేసులో నిందితుడైన మద్దూరి విజయ్‌‌ను అడ్వొకేట్ సమక్షంలో ఎంక్వైరీ చేయాలని పోలీసులకు హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 మధ్య విచారణ చేపట్టాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ నిందితుడు మద్దూరి విజయ్‌‌ మంగళవారం లంచ్‌‌ మోషన్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌ రెడ్డి విచారణ చేపట్టారు. 

పిటిషనర్‌‌ తరఫు అడ్వొకేట్ వాదనలు వినిపిస్తూ.. ‘‘నా క్లయింట్ విజయ్.. వ్యాపార వ్యవహారాల్లో భాగంగా విదేశీ ప్రయాణాలు చేస్తుంటారు. అందులో భాగంగా ఇటీవల నెదర్లాండ్స్‌‌ నుంచి వచ్చారు. ఆ వెంటనే దీపావళి వేడుకల్లో పాల్గొనాలంటూ పాకాల రాజేంద్ర ప్రసాద్‌‌ ఆహ్వానించారు. దీంతో విజయ్ తన ఫ్యామిలీతో కలిసి జన్వాడ ఫామ్​హౌస్ వెళ్లారు. పోలీసులు సోదాలు చేసి యూరిన్ శాంపిల్స్‌‌ తీసుకున్నారు. కొకైన్ తీసుకున్నట్లు పాజిటివ్‌‌ వచ్చిందని కేసు నమోదు చేశారు. 

ఇండియాలో కొకైన్ తీసుకోలేదు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా విజయ్​ను వేధిస్తున్నారు. ఈ నెల 4న బీఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌ సెక్షన్‌‌ 35(3) కింద నోటీసు ఇచ్చి రెండు రోజుల్లో హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. అరెస్ట్‌‌ చేసే అవకాశాలున్నాయి. కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వండి. మద్దూరి విజయ్ అమెరికన్ సిటిజన్. ఇక్కడి కేసు విషయమై హైదరాబాద్‌‌లోని యూఎస్ ఎంబసీకి కూడా ఫిర్యాదు చేశాం’’అని అడ్వొకేట్ వాదించారు. 

అదనపు అడ్వొకేట్‌‌ జనరల్‌‌ మహమ్మద్‌‌ ఇమ్రాన్‌‌ఖాన్‌‌ వాదనలు వినిపిస్తూ.. ‘‘అమెరికా పౌరసత్వం ఉందనే కారణంతో ఇక్కడి చట్టాలు ఉల్లంఘించడానికి వీల్లేదు. కొకైన్‌‌ తీసుకున్నట్లు పాజిటివ్‌‌ వచ్చింది’’అని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి.. అడ్వొకేట్​తో కలిసి పోలీసుల విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేశారు.