యూట్యూబర్ ​: వండుకుని తినడమే ఆనందం

యూట్యూబర్ ​: వండుకుని తినడమే ఆనందం

గాలి వీస్తున్నప్పుడు.. పొయ్యి మీద సాంబార్​ మసులుతున్నప్పుడు.. ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు ఒకరకమైన రిలాక్సింగ్​ సౌండ్స్​ వినిపిస్తుంటాయి. ఈ సౌండ్స్​ని చాలామంది ఇష్టపడతారు. అచ్చం అలాంటి సౌండ్స్​నే వంట చేస్తూ​ క్రియేట్​ చేస్తున్నాడు జపాన్​కు చెందిన డ్రెడ్​ యమడ. ఆ సౌండ్స్​తోపాటు అతని ఫుడ్​ మేకింగ్​ స్టయిల్ కూడా నచ్చడంతో లక్షలమంది అతని వీడియోలు చూస్తున్నారు. 

డ్రెడ్ యమడ జపనీస్ టిక్‌‌‌‌టాక్ సంచలనం. టిక్​టాక్​లో అతను పోస్ట్​ చేసే వీడియోలను ప్రపంచం నలుమూలల నుంచి చూస్తుంటారు. 2023 జనవరి 2న అతను ‘ఒమాచి’ చిప్స్​ అనే వీడియో ఒకటి చేశాడు. ఆ వీడియోతో ఒక్కసారిగా లైమ్​లైట్​లోకి వచ్చేశాడు. అప్పటినుంచి అతన్ని సోషల్​ మీడియాలో కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు. డ్రెడ్​1994 అక్టోబరు 2న జపాన్‌‌‌‌లో పుట్టాడు. ప్రస్తుతం అతనికి 29 ఏళ్లు. వీడియోలో అతను తక్కువ కనిపిస్తుంటాడు. ఎక్కువగా కుకింగ్​ ప్రాసెస్​ మాత్రమే కనిపిస్తుంటుంది. వ్యక్తిగత జీవితం​, కుటుంబం గురించి వీడియోల్లో ఎప్పుడూ ప్రస్తావించలేదు. 

టిక్​టాక్​ నుంచి యూట్యూబ్​

డ్రెడ్​కు మొదటినుంచి ఏఎస్​ఎంఆర్​ (అటానమస్ సెన్సరీ మెరిడియన్ రెస్పాన్స్) సౌండ్స్​ అంటే ఇష్టం. దాంతోపాటు వంట చేయడం కూడా ఇష్టమే. అందుకే ఈ రెండింటినీ కలిపి చేయాలనే ఉద్దేశంతో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. కానీ.. వీడియోలు పోస్ట్​ చేసింది మాత్రం టిక్​టాక్​లోనే. ఇండియాలో లేకపోయినా టిక్​టాక్​ చాలా దేశాల్లో ఇప్పటికీ ఎఫెక్టివ్​గా పనిచేస్తోంది. డ్రెడ్​ కూడా టిక్​టాక్​  వల్లే ఫేమస్​ అయ్యాడు. ముఖ్యంగా అతని ముఖ కవళికలు, మూమెంట్స్​ అందరికీ నచ్చేలా ఉంటాయి. గమ్మత్తయిన ఎక్స్​ప్రెషన్స్​ ఇస్తుంటాడు. అందుకే తక్కువ టైంలోనే అతనికి ఫాలోయింగ్​ పెరిగింది. ముఖ్యంగా టిక్​టాక్​లో పోస్ట్​ చేసిన చమత్కారమైన ముక్‌‌‌‌బాంగ్ వీడియోల వల్ల ఎక్కువ గుర్తింపు వచ్చింది. ముక్​బాంగ్​ అంటే... ఈటింగ్​ బ్రాడ్​కాస్ట్​ అని అర్థం. ఈ పదం, తినే పద్ధతి సౌత్​ కొరియా నుంచి వచ్చింది. 

 కేఎఫ్​సీ చికెన్ నగ్గెట్స్‌‌‌‌ తయారుచేసి అందులో సాస్‌‌‌‌ వేసుకుని తినే వీడియోకు టిక్​టాక్​లో బాగా రీచ్​ వచ్చింది. అతను సోషల్​ మీడియాలోకి రాకముందు కంటెంట్ ప్రొడక్షన్‌‌‌‌, వెబ్ మార్కెటింగ్ సపోర్ట్ ఇచ్చే హైబాల్‌‌‌‌ అనే కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అక్కడ పనిచేసిన ఎక్స్​పీరియెన్స్​ డ్రెడ్​కు కంటెంట్​ క్రియేట్​ చేయడంలో చాలా ఉపయోగపడింది. పైగా అతను ఒక చెఫ్ కూడా. టిక్​టాక్​లో వచ్చిన సక్సెస్​తో డ్రెడ్​ 2023 జనవరి 1న యూట్యూబ్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘డ్రెడ్ యమడ’ పేరుతో ఛానెల్​ క్రియేట్​ చేశాడు. ప్రస్తుతం ఛానెల్​కు 4.07 మిలియన్ల మంది సబ్​స్క్రయిబర్లు ఉన్నారు.

సబ్​స్క్రయిబర్ల సంఖ్యను వంద మిలియన్లకు పెంచుకోవాలనే టార్గెట్​తో పనిచేస్తున్నాడు. అందుకే ఛానెల్​ డిస్క్రిప్షన్​లో కూడా ‘గోల్​ 100 ఎం’ అని రాశాడు. ఛానెల్​లో ఇప్పటివరకు 389 వీడియోలు పోస్ట్​ చేశాడు. వాటిలో షార్ట్​ వీడియోలే ఎక్కువగా ఉన్నాయి. సబ్​స్క్రయిర్ల సంఖ్యతో సంబంధం లేకుండా వ్యూస్​ మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక వీడియోకు 315 మిలియన్ల వ్యూస్​ వచ్చాయి. మరో వీడియోకు 219 మిలియన్ల వ్యూస్​ ఉన్నాయి. ఇక పది మిలియన్ల వ్యూస్​ దాటిన వీడియోలు ఛానెల్​లో ఎన్నో ఉన్నాయి. 

టిప్స్​

డ్రెడ్​ తన వీడియోల్లో ఫుడ్​ ప్రిపేర్​ చేయడంతో పాటు అప్పుడప్పుడు టిప్స్​ కూడా చెప్తుంటాడు. అతని వీడియోల్లో ఎంటర్​టైన్​మెంట్​ ఒక్కటే కాకుండా  వంటింటి టిప్స్​ కూడా వస్తుంటాయి. ఉదాహరణకు.. ఉల్లిపాయలను కోసే సరైన పద్ధతులు.. కూరగాయలను ఉడికించే విధానం లాంటివి కొన్ని. అలాగే కొన్ని రకాల ఫుడ్స్​ని ఎలా? ఎప్పుడు తింటే బాగుంటుందో కూడా వీడియోల ద్వారా చెప్తుంటాడు. 

సంపాదన ఇలా...

యమడ షార్ట్​ వీడియోలే ఎక్కువగా చేస్తుంటాడు. మరి ఆదాయం ఎలా వస్తుంది? అనే డౌట్​ వస్తుంది చాలామందికి. వాటిలోనే చాలా ప్రమోషన్లు చేస్తుంటాడు డ్రెడ్​. సోషల్ మీడియాలో వచ్చిన ఫేమ్​తో ఇప్పటివరకు చాలా కొలాబరేషన్లు చేశాడు. ఉదాహరణకు ఇంటర్నేషనల్​ సూపర్‌‌‌‌స్టార్ షకీరా మ్యూజిక్​  వీడియోను తన ఛానెల్​లో పోస్ట్​ చేశాడు. 

ఏఎస్​ఎంఆర్​ 

అటానమస్ సెన్సరీ మెరిడియన్ రెస్పాన్స్ అంటే ఒక రకమైన జలదరింపు. ఇది సాధారణంగా తలమీద మొదలై మెడ, వెన్నెముక వెనుక భాగంలోకి వస్తుంది. సాధారణంగా ఇలాంటి జలదరింపు కొన్ని రకాల సౌండ్స్​ వింటే వస్తుంది. వాటినే ఏఎస్​ఎంఆర్​ సౌండ్స్​ అంటారు. ఇలాంటి సౌండ్స్​ని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎక్స్​పీరియెన్స్​ చేసే ఉంటారు. ఇల్లు ఊడుస్తున్నప్పుడు, కత్తితో ఉల్లిపాయల్లాంటి వాటిని కోస్తున్నప్పుడు ఇలాంటి శబ్దాలు వినిస్తుంటాయి. ఆ సౌండ్స్​ని చాలా హై క్వాలిటీ మైక్స్​తో రికార్డ్​ చేస్తుంటారు.