98కి చేరిన భూకంప మృతుల సంఖ్య.. 211మంది ఆచూకీపై సందిగ్ధత

సెంట్రలో జపాన్‌లో భారీ భూకంపం సంభవించిన ఐదు రోజుల తర్వాత, 98 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు దాదాపు 450మందికి గాయాలు కాగా.. 211మంది ఆచూకీ లభ్యం కాలేదని అధికారులు చెబుతున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిని కనుగొనడం కంటే మృతదేహాలను వెలికితీయడంపై దృష్టి కేంద్రీకరించిన అధికారులు.. శిథిలాల ద్వారా చిక్కుకున్న వారి కోసం జల్లెడ పడుతున్నారు. అంతకుముందు జపాన్‌లోని మెయిన్ హోన్షు ద్వీపంలోని ఇషికావా ప్రాంతంలో కొత్త సంవత్సరం రోజున 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

వాతావరణం సహకరించకపోవడంతో వేలాది మంది రెస్క్యూ వర్కర్ల సహాయానికి ఆటంకం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో కురుస్తున్న మంచు, రోడ్లపై పగుళ్లు, పడిపోయిన చెట్లు, రాళ్లు ఇవన్నీ వారి సహాయ కార్యక్రమాలకు అడ్డుగా నిలిచాయి. ఇక సుజులో, డజన్ల కొద్దీ గృహాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఓడరేవు ప్రాంతంలో సునామీ అలల వల్ల చేపలు పట్టే పడవలు మునిగిపోయాయి. ఒక వ్యక్తి కూడా ఇందులో కొట్టుకుపోయినట్లు సమాచారం.

ఇషికావా ప్రాంతంలో దాదాపు 23వేల 800 గృహాలకు విద్యుత్తుకు ఆటంకం కలిగింది. 66వేల 400 కంటే ఎక్కువ ఇండ్లకు నీటి సరఫరా లేదు. ప్రస్తుతం 357 ప్రభుత్వ ఆశ్రయాల్లో 31,400 మందికి పైగా ఉన్నారు.