కుమమోటో (జపాన్): ఫామ్ కోల్పోయి కొంతకాలంగా వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ మరో సవాల్‌కు సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే కుమంటో మాస్టర్స్ జపాన్ సూపర్ 500 టోర్నమెంట్‌లో అయినా సత్తా చాటి గాడిలో పడాలని చూస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గలేకపోయిన సింధు, సేన్ అప్పటి నుంచి ఒక్క టోర్నీలో కూడా రాణించలేకపోయారు. సింధు డెన్మార్క్ ఓపెన్‌లో క్వార్టర్స్‌తో సరిపెట్టగా.. సేన్ ఆర్సిటిక్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్ టోర్నీల్లో ప్రారంభ రౌండ్లలోనే వెనుదిరిగాడు. ఎలాగైనా ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్న సింధు తొలి రౌండ్‌లో థాయ్‌లాండ్ షట్లర్ బుసానాన్‌తో పోటీపడనుంది. మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్.. మలేసియాకు చెందిన లెయోంగ్ జున్ హవోతో పోరు ఆరంభించనున్నాడు. ఈ ఇద్దరితో పాటు విమెన్స్ డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ కూడా బరిలో నిలిచారు.