
ఆ తాత రోడ్డు పక్కన పార్క్ చేసిన సైకిల్ ని ఏస్కోని రయ్యిన పోయిండు. అది జూసిన ఓనర్ వెంటపడ్డడు. ఆ తాత దొరకలే. 'నా సైకిల్ దొంగ ఎత్తుకపోయిండు' అని కంప్లైంట్ ఇయ్యడానికి అతడు పోలీస్ స్టేషన్ కి చేరుకుండు. కట్ చేస్తే ఆ 'సైకిల్ తాత' కూడా ఆడికే వచ్చిండు. "సూడుండ్రి. గీ సైకిల్ నేనే ఎత్తుకొచ్చిన' అని నవ్వుకుంట చెప్పిండు. దొంగతనం చేసిందిగాక నవ్వుతావని తాతని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుక పోయిండ్రు. దొంగతనం ఒప్పుకున్న గూడా ఆ ముసలాయనకు ఏడాది శిక్ష వేసిండు జడ్జి సారు. పాపం బాధనిపిస్తంది. కదూ? కానీ ఆ తాత మొకంలో సంతోషమే ఉంది. ఎందుకంటే ఆయన జైలుకు పోదామనే ఆ పని చేసిండు. ఆ తాతది మన దేశం కాదు. జపాన్! వాళ్ల దేశంలో ఇరవై ఏండ్లసంది అరవై ఏండ్లు దాటిన తాతలు గిట్లాంటి నేరాలు చేసి జైలుకు పోవడం పెరిగిందంట! అసలు వాళ్లు ఎందుకు జైలుకు పోతున్నరో తెలిస్తే రందిపడతరు.
తనకు 62 ఏళ్ల వయసున్నప్పుడు మొదటిసారి సైకిల్ దొంగతనం చేసిండట 69 ఏళ్ల తోషియే టకటా. ఏడాది జైలులో ఉండి వచ్చి మళ్ల చేసిండంట. అట్లా ఇప్పటికే చానా సార్లు జైలుకు పోయి వచ్చిండు. పోని పెద్ద దొంగతనాలు చేస్తుండా అంటే అదీ లేదు. ఈ మధ్యనే జైలు నుంచి విడుదలై వచ్చినప్పుడు 'ఎందుకు తాత గిట్ల చేస్తున్నవు? జర జెప్పరాదు అంటే.. 'నాకు జైల్ల ఉంటేనే మంచిగుంటది'అని చెప్పిండు. "జర వివరంగా చెప్పు తాత' అంటే గుట్టు విప్పిండు. "నేను జైల్లో అయితే ఫ్రీగా ఉండొచ్చు. జైల్లో ఉన్నా నాకు ఫించను ఒస్తది. బయట ఉంటే ఆ నెల పైసలు పది రోజులు తింటానికి గూడా సరిపోవు. ఇక్కడుంటే అన్నానికి అన్నం. ఫించనుకు ఫించన్ సేవ్ అయితది.' అని చెప్పిండు. అంతేకాదు.. ఆ తాత ఒంటరితనం తట్టుకోలేక కూడా జైలు మొకం జూస్తున్నడంట. అక్కడైతే అందరూ ఉంటరని ఆయన ఫీలింగ్. "నా ఇద్దరు తమ్ముళ్లూ ఇప్పుడు కాంటాక్ట్ లో లేరు. నా మాజీ భార్యలు కూడా ఫోన్ఎత్తుత లేరు. ముగ్గురు పిల్లలు ఉన్నా... ఎక్కడున్నరో తెల్వదు. ఇక్కడ ఒంటరిగా ఉండే బదులు జైల్లో అందరితో ఉండొచ్చు'అని చెప్పిండు ఆ తాత.. ఇట్లా ఈ ఒక్క తాత కాదు చానా మంది ఉన్నరు జపాన్లో.
ఏం చేసి సంపాదించాలి?
ఇంకో ముసలమ్మ పేరు కెయికో. ఆమెకు డెబ్బై ఏండ్లు. ఆమె కూడా రెగ్యులర్ గా జైలుకు పోయి వస్తది. ఎందుకు ఇట్ల చేస్తున్నవు తల్లి అనడిగితే.. ఏ'నా భర్త లేడు. ఉండటానికి గూడు లేదు. ఈ వయసులో పని చేసి సంపాదించలేను. ఇగ నాకు పైసలెట్ల వస్తయ్ బిడ్డా? తిండి కోసం దొంగతనం చేసి జైలుకు పోతున్న. నాకు అక్కడే మంచిగ ఉంది' అని కెయికో చెప్పింది. 80 ఏండ్లు దాటి, నడవలేని స్థితిలో ఉన్నోళ్లు గూడా చిన్న చితక నేరాలు చేసి జైలుకు పోతున్నరు.. వీళ్లలో చానామంది సూపర్ మార్కెట్లో ఫుడ్ దొంగతనం చేస్తున్నవాళ్లే ఉన్నరు.
మారిన సంప్రదాయాలే...!
'గతంలో ఉన్న సంప్రదాయం ప్రకారం పిల్లలే వారి తల్లిదండ్రులను చూసుకునేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినయ్. మెరుగైన జీవనం, ఉద్యోగం కోసం పిల్లలు తల్లిదండ్రులను విడిచి దూరంగా పోతున్నరు. తల్లిదండ్రులు గూడా పిల్లలకు తాము భారం కావొద్దు అని అనుకుంటున్నరు. బిల్లు లేకుండా మూడు పూటలా అన్నం దొరికేది జైల్లో మాత్రమే! అందుకే వాళ్లు నేరాలు చేస్తున్నరు' అని మైకెల్ న్యూమన్ అనే ఆస్ట్రేలియన్ డెమోగ్రాఫర్ వాళ్లపై అధ్యయనం చేసిన తర్వాత తన నివేదికలో ఈ వివరాలు వెల్లడించిండు.
కౌన్సెలింగ్ ఇస్తున్న ప్రభుత్వం..
ఇట్ల జైలుకు వస్తున్న వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. జైల్ల నిండా ముసలోళ్లు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇట్ల జైళ్లకు రాకుండా అడ్డుకోవడానికి ముసలోళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. జపాన్లో జైలుకు వెళ్లినా వృద్ధాప్య ఫించను వస్తది. అయితే ప్రభుత్వం ముందు ముసలోళ్ల ఫించనుపెంచాలని కొందరు డిమాండ్ చేస్తున్నరు. నెలగడవని ఫించను ఇస్తున్నరని కొందరు ప్రభుత్వంపై కోప్పడుతున్నరు.