జపాన్ లో భారీ భూకంపం.. ఊర్లలోకి వస్తున్న సముద్రం నీళ్లు

న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో ఉన్న జపాన్ దేశానికి షాక్.. అత్యంత భారీ భూ కంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 7.5 తీవ్రతగా నమోదైంది. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పే సమయంలో.. తెల్లవారుతూనే జపాన్ ప్రజలు బ్యాడ్ న్యూస్ విన్నారు. ఇషికావా కేంద్రంగా ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ వాతావరణ శాఖ ప్రకటించింది. 

తీవ్ర భూకంపం కావటంతో సునామీ హెచ్చరికలు జారీ చేసింది జపాన్ వెదర్ డిపార్ట్ మెంట్. నీగాటా, టొయామా, యమగటా, ఫుకుమా, హ్యోగో, ప్రిఫెక్చర్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు ఇవ్వటంతోపాటు.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అదే విధంగా అలలు 5 మీటర్ల కంటే ఎత్తులో ఎగసిపడే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలు అందరూ సముద్రం నుంచి దూరంగా వెళ్లాలని సూచించింది. 

భూకంప తీవ్రత 7.5గా నమోదు కావటంతో.. గత జ్ణాపకాలను గుర్తు చేసుకుంటున్నారు జపాన్ ప్రజలు. గతంలో సునామీలు విరుచుకుపడినప్పుడు కూడా 7.5 తీవ్రతతలోనే భూకంపాలు వచ్చాయి. దీంతో జపాన్ దేశం వణికిపోతుంది. భూకంపం సముద్రంలో రావటంతో.. సునామీ వల్ల ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో అనే భయం వెంటాడుతుంది ప్రజలను. సునామీ అలలు తీరానికి రావటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు. ఈలోపు తీర ప్రాంత ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

న్యూఇయర్ వేడుకలు చాలా వరకు సముద్ర తీరాల్లో ఏర్పాటు చేశారు. జనం కూడా ఎక్కువగా ఆయా ప్రాంతాలకు తరలి వచ్చారు. ఈ క్రమంలోనే అప్రమత్తం అయ్యారు అధికారులు.