టోక్యో సిటీ కింద వరద రిజర్వాయర్లు..ఎన్ని నీళ్లొచ్చినా లాగేసుకుంటయ్

ముంబై, చెన్నై, హైదరాబాద్​ ఇలా చాలా సిటీల్లో కుండపోత వర్షం కురిస్తే చాలు రోడ్లన్నీ నిమిషాల్లో చెరువుల్లా మారుతుంటయి. ఒక్కసారిగా వెల్లువెత్తే వాన నీళ్లు వెళ్లేందుకు మార్గం లేకపోవడమే అందుకు కారణం. అయితే.. జపాన్ రాజధాని టోక్యోలో ఈ సమస్యకు ఓ సూపర్ ప్లాన్ వేశారు. అదే.. సిటీ కింద అండర్ గ్రౌండ్ లో.. ఫ్లడ్ రిజర్వాయర్లు! ఇవి రోడ్ల మీదుగా భారీగా పోటెత్తే వర్షపు నీటిని ఎప్పటికప్పుడు లాగేసుకుని.. ఆ నీటిని నేరుగా నదుల్లోకి పంపుతాయి. ఈ ఫ్లడ్ ట్యాంకులు ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు వరదల బారిన పడకుండా కాపాడుతున్నాయి. ఒక్క టోక్యోలోనే ఇలాంటివి పది రిజర్వాయర్లున్నాయి. వాటిలో సయీటమా ప్రాంతంలో ఉన్న కసుకబే రిజర్వాయర్..  ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ గ్రౌండ్ ఫ్లడ్​ ట్యాంక్.

కసుకబే రిజర్వాయర్​ను 2006లో 220 కోట్ల డాలర్ల(రూ.16 వేల కోట్లు) ఖర్చుతో కట్టారు. ఏడాదికి దాదాపు ఏడుసార్లు ఇది వరదల నివారణ కోసం సాయపడుతుంది. రోడ్లు, వీధుల్లోని వరద నీళ్లన్నీ ఆటోమేటిక్ గా మెయిన్ ట్యాంక్ లోకి వచ్చేస్తాయి. ట్యాంక్ ఫుల్ కాగానే.. ఫ్లడ్ టన్నెల్ ద్వారా ఆ నీటిని విడుదల చేస్తారు. వరదల వల్ల ఆస్తి నష్టమే కాకుండా.. ఆ తర్వాత క్లీనింగ్ కు కూడా ఎంతో ఖర్చవుతుంది. అలా కేవలం వరదల తర్వాత క్లీనింగ్ ఖర్చులను చూసుకున్నా.. ఈ రిజర్వాయర్ వల్ల148 బిలియన్ యెన్ ల (రూ.10 వేల కోట్లు) ఖర్చు ఆదా అయిందని అంచనా.

90% వరదలను తగ్గించింది..

ఈ ఫ్లడ్ రిజర్వాయర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరదలను 90 శాతం వరకూ తగ్గిస్తోందట. అంటే.. గతంలో వరదల బారిన పడిన ఇండ్ల సంఖ్యతో పోలిస్తే.. ఇప్పుడు వరదల బారిన పడుతున్న ఇండ్లు 90 శాతం వరకూ తగ్గాయి.

టోక్యో కింద ఇప్పటికే 10 రిజర్వాయర్లు..

టోక్యో సిటీలో ఇప్పటికే10 ఫ్లడ్ రిజర్వాయర్లు, 3 ఫ్లడ్ టన్నెల్స్ ఉన్నాయట. గ్లోబల్ వార్మింగ్ వల్ల సిటీకి వరదల ముప్పు పెరిగిన నేపథ్యంలో మరిన్ని ఫ్లడ్ ట్యాంకులూ
నిర్మిస్తున్నారట. ఒసాకా సిటీలో కూడా 350 కోట్ల డాలర్లతో కసుకబే లాంటి రిజర్వాయర్ ను కడుతున్నారు.

ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉంటరు..

ఫ్లడ్ రిజర్వాయర్ల వద్ద సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉంటారు. ముఖ్యంగా జపాన్ లో కుండపోత వర్షాలు, టైఫూన్లు ఎక్కువగా వచ్చే సీజన్ అయిన జూన్ నుంచి అక్టోబర్ చివరి వరకూ నిరంతరం అలర్ట్ గా ఉంటారు.

విజిటర్లూ చూసిరావొచ్చు..

ఫ్లడ్ రిజర్వాయర్ లో నీళ్లు లేనప్పుడు, పూర్తిగా ఖాళీ అయిన సమయాల్లో విజిటర్లను కూడా ఇందులోకి అనుమతిస్తారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ విషయంలో వారికి అవగాహన కల్పిస్తారు.

ట్యాంక్ నుంచి నదికి టన్నెల్స్..

కసుకబే రిజర్వాయర్ 6.3 కిలోమీటర్ల పొడవున్న ఓ టన్నెల్ కు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ టన్నెల్ ద్వారా వరద నీటిని సమీపంలోని ఎడొగవా నదికి పంపుతుంది. ఓ జెంబో జెట్ ఇంజన్ సాయంతో ప్రతి సెకనుకు 25 మీటర్ల స్విమ్మింగ్ పూల్ లో పట్టేంత నీటిని ఇది నదిలోకి విడుదల చేస్తుంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పట్టేంత స్పేస్ 

కసుకబే ఫ్లడ్ ట్యాంక్.. ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ గ్రౌండ్ ఫ్లడ్ ట్యాంక్. 70 మీటర్ల లోతు, 60 మీటర్ల వెడల్పు ఉండే భారీ కాంక్రీట్ పిల్లర్స్ తో కూడిన ట్యాంక్ ఇది. ఒక్కో పిల్లర్ ను 500 టన్నుల కాంక్రీట్ తో కట్టారు. మొత్తం ట్యాంక్ సైజ్ రెండు ఫుట్ బాల్ ఫీల్డులంత ఉంటది. ఇందులోని కొన్ని భాగాల్లో ఏకంగా స్టాచ్యూ ఆఫ్​లిబర్టీ పట్టేంత  ఖాళీ స్థలం ఉంటుంది.