![ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరితే.. లక్ష రూపాయల జీతం.. ఫ్రీగా మందు, ‘హ్యాంగోవర్ లీవ్స్’..!](https://static.v6velugu.com/uploads/2025/02/japanese-company-trust-ring-a-small-tech-company-in-osaka-is-offering-free-alcohol-and-hangover-leaves-to-attract-new-talent_0Vn7kFUJSg.jpg)
ఉద్యోగం చేస్తే ఏ సంస్థ అయినా ఒక ఉద్యోగికి ఏం ఇస్తుంది. జీతం ఇస్తుంది. సంవత్సరానికి ఒకసారో.. రెండుసార్లో జీతాలు పెంచుతుంది. ఏ పండగకో.. పబ్బానికో బోనస్లు, స్వీటు బాక్స్లు ఇస్తుంది. ఇంతకు మించి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తు్న్న ఉద్యోగికి పెద్దగా దక్కేదంటూ ఏమీ ఉండదు. కొన్ని మల్టీ నేషనల్ టెక్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకైతే ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఆటవిడుపు కోసం ఆఫీస్ క్యాంపస్లోనే అవీఇవీ ఉంటుంటాయి. కానీ.. జపాన్లోని ఒసాకాలో ఉన్న ఈ చిన్న టెక్ కంపెనీ తమ సంస్థలో చేరే ఉద్యోగులకు మందు, విందు కూడా ప్రొవైడ్ చేస్తామని ప్రకటించింది. ‘హ్యాంగోవర్ లీవ్స్’ కూడా తీసుకోవచ్చని, ఆఫీస్కు ఆలస్యంగా వచ్చినా ఎందుకు లేట్గా వచ్చావని అడగమని ట్రస్ట్ రింగ్(Trust Ring) అనే ఈ జపాన్ టెక్ కంపెనీ ప్రకటించింది.
ఈ జపాన్ కంపెనీ చేసిన వినూత్న ఆలోచన, ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఈ ‘హ్యాంగోవర్ లీవ్స్’ గురించి ఆ సంస్థలో ఉద్యోగిగా చేస్తున్న ఒకరు ఏం చెప్పారంటే.. ‘‘హ్యాంగోవర్ లీవ్ సిస్టమ్ను వినియోగించుకుంటున్నాను. ఉదయాన్నే ఆఫీస్ కు వెళ్లే బదులు మధ్యాహ్నం 12 గంటలకు ఆఫీస్కు వెళుతున్నాను. రెండు, మూడు గంటలు ఎక్కువగా నిద్రపోవడం వల్ల మైండ్ అంతా ఫ్రెష్ గా ఉంటుంది. మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాను’’. ఇదీ ట్రస్ట్ రింగ్ ఉద్యోగి చెప్పిన విషయం.
Also Read :- బ్యాన్ చేసిన చైనా యాప్లు మళ్లీ భారత్లోకి ఎంట్రీ
ఈ వినూత్న ఆలోచనపై ట్రస్ట్ రింగ్ కంపెనీ సీఈవో స్పందిస్తూ.. శాలరీ పరిమితుల వల్ల, బడ్జెట్ వల్ల తాను నైపుణ్యం ఉన్న ఉద్యోగులను పొందలేకపోతున్నానని, ‘హ్యాంగోవర్ లీవ్ సిస్టం’, ఫ్రీ ఆల్కహాల్ ఆలోచన వల్ల శాలరీ కంటే వర్క్ కల్చర్ నచ్చి ఉద్యోగులు జాయిన్ అవుతారన్న నమ్మకంతో ఈ ఆలోచన చేసినట్లు చెప్పారు. ఈ కంపెనీలో స్టార్టింగ్ శాలరీ 1.27 లక్షలు. ఇందులో.. 20 గంటలు ఓవర్ టైం పనిచేసినందుకు కూడా కలిపి చెల్లిస్తారు.