అక్కడ రోజుకొకసారైనా కచ్చితంగా నవ్వాలి.. కొత్త రూల్

‘నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం’ అనే నానుడి మనందరికీ తెలిసిందే. అయితే, జపాన్​లో జనాలు రోజుకి ఒక్కసారి కూడా నవ్వలేని పరిస్థితిలో ఉన్నారట. అందుకే అక్కడి ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. అదేంటంటే.. ఇక ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్కసారైనా నవ్వాల్సిందే!

ఏ దేశంలోనైనా పాలనాపరమైన చట్టాలు చేస్తారు. నేరాన్ని అదుపులోకి తీసుకురావడానికి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వాలు నిబంధనలు అమలుచేస్తాయి. జపాన్‌లో మాత్రం ప్రతిరోజూ అందరూ నవ్వాలని చట్టం తీసుకొచ్చారు. అది విన్న వాళ్లలో కొందరు ఇదేం చట్టం అని ఆశ్చర్యపోయారు. అయితే, అక్కడి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం ఉంది. 

యమగట విశ్వవిద్యాలయంలోని ‘ఫ్యాక్టరీ ఆఫ్‌ మెడిసిన్‌’ చేసిన రీసెర్చిలో తక్కువగా నవ్వే వాళ్లలో కొందరు పలు వ్యాధులతో చచ్చిపోతున్నారని వెల్లడైంది. అందుకని జపాన్​ ప్రభుత్వం రోజులో ఒక్కసారి కచ్చితంగా నవ్వాలనే రూల్​ తెచ్చిందన్నమాట. పని ప్రదేశంలో కూడా నవ్వుకునే వాతావరణాన్ని క్రియేట్ చేయాలనీ, ఆ ప్రాసెస్​ని ఎంకరేజ్ చేయాలని కంపెనీలను ఆదేశించింది. ప్రతినెలా ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా ‘హాస్యంతో ఆరోగ్యం (హెల్త్ విత్ లాఫ్​)’ కోసం కేటాయించింది.

 శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా తీసుకున్నదే ఈ నిర్ణయం. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే ఇలాంటి చట్టాలు తీసుకొచ్చారో కదా! అయితే, ఈ చట్టం మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘నవ్వొస్తే నవ్వుతారు. అంతే కానీ కచ్చితంగా నవ్వాలని చట్టం చేయడం ఏంటి?’ అంటున్నారు కొందరు. వ్యక్తిగత కారణాల వల్ల కొందరికి నవ్వే పరిస్థితి ఉండకపోవచ్చు. 

బలవంతంగా నవ్వాల్సిందేననే ఇలాంటి చట్టాలు చేయడమంటే ప్రజల హక్కులను కాలరాయడమే అంటున్నారు. అయితే, ఆ విమర్శలన్నింటినీ అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కొట్టిపారేసింది. ‘‘నవ్వడం అనేది ప్రజల ఇష్టానికే వదిలేశాం. అందుకే కదా నవ్వకపోతే జరిమానా విధిస్తాం... అనేలాంటి అంశాలను చట్టంలో చేర్చలేదు” అంటోంది ఆ పార్టీ.