పల్లెకు పోయి పెండ్లి చేస్కుంటే పైసలు..! యువతులకు సర్కారు బంపర్ ఆఫర్

పల్లెకు పోయి పెండ్లి చేస్కుంటే పైసలు..! యువతులకు సర్కారు బంపర్ ఆఫర్

టోక్యో: జపాన్ ప్రభుత్వం పెండ్లి కాని యువతులు, మహిళల(సింగిల్ విమెన్)కు ఆఫర్ ప్రకటించింది. రాజధాని టోక్యో నుంచి పల్లెలకు వెళ్లి పెండ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయితే ఆర్థిక సాయం చేస్తామని, ఇతర ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపింది. చదువు, ఉద్యోగాల కోసం యువతులు పెద్ద ఎత్తున టోక్యోకు వచ్చి సెటిల్ అవుతుండటంతో పల్లెల్లో స్త్రీ, పురుష నిష్పత్తి గణనీయంగా పడిపోతోందట. దీంతో అక్కడి యువకులకు పెండ్లిండ్లు కావడం కష్టంగా మారిపోయిందట. అందుకే గ్రామాల్లో యువతీ యువకుల సంఖ్యను బ్యాలెన్స్ చేయడం కోసం అక్కడి సర్కారు ఇలా ప్రత్యేక ప్రోత్సాహకాలతో ఒక పథకాన్ని ప్రకటించింది. 

Also Read:-వానాకాలంలోనూ కరెంట్​కు మస్త్ డిమాండ్

2025 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైందని ‘ది జపాన్ టైమ్స్’ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. ఈ స్కీంలో భాగంగా.. టోక్యోలో ఉంటున్న పెండ్లికాని యువతులు, మహిళలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పెండ్లి సంబంధాలు చూసుకుంటే.. అందుకు అయ్యే మొత్తం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఒకవేళ టోక్యోలోని యువతులు పల్లెలకు వెళ్లి అక్కడి యువకులను పెండ్లి చేసుకుని.. అక్కడే సెటిల్ అయితే దాదాపు 7 వేల డాలర్ల(రూ. 5.87 లక్షలు) ఆర్థిక సాయం చేయనుంది.

ఒంటరి పురుషులు, స్త్రీల సంఖ్యలో 20% తేడా 

2020 జనాభా లెక్కల ప్రకారం.. టోక్యో మినహా మిగతా 46 ప్రిఫెక్చర్లలో 15 నుంచి 49 ఏండ్ల మధ్య ఉన్న ఒంటరి మహిళలు 91 లక్షల మంది ఉన్నారు. ఇదే ఏజ్ గ్రూప్‎లో ఒంటరి పురుషులు 1.11 కోట్ల మంది ఉన్నారు. అంటే.. యావరేజ్‎గా ప్రతి 100 మంది ఒంటరి పురుషులకు 80 మంది మాత్రమే ఒంటరి మహిళలు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ గ్యాప్ 30% వరకూ చేరింది. 

మరోవైపు జపాన్‎లో బర్త్ రేట్ రికార్డ్ స్థాయిలో పడిపోతోంది. పోయిన ఏడాది 7,27,277 జననాలు మాత్రమే నమోదయ్యాయి. జనాభా స్థిరంగా ఉండాలంటే జననాల రేటు కనీసం 2.1గా ఉండాలి. కానీ నిరుడు ఇది ఏకంగా 1.20కి పడిపోయింది. అందుకే పెండ్లిండ్లను ప్రోత్సహించడంతోపాటు జననాల రేటును పెంచేందుకు సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది.