- ఒకరు మృతి.. ఏడుగురు గల్లంతు
టోక్యో : జపాన్ నేవీకి చెందిన రెండు హెలికాప్టర్లు టోక్యోకు దక్షిణాన పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, ఏడుగురు గల్లంతయ్యారు. పైలట్లు శిక్షణ తీసుకొంటుండగా శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన రెండు ఎస్ హెచ్ 60కే చాపర్లలో మొత్తం ఎనిమిది మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు.
ఒక్కో హెలికాప్టర్లో నలుగురు సిబ్బంది ఉన్నారు. టోక్యోకు దక్షిణాన 600 కి.మీ. దూరంలోని తోరిషిమా ద్వీపం సమీపంలో శనివారం అర్ధరాత్రి హెలికాప్టర్లు కాంటాక్ట్ కోల్పోయాయని రక్షణ మంత్రి మినోరు కిహరా తెలిపారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలియదని, రెండు హెలికాప్టర్లు సముద్రంలో కూలిపోయే ముందు ఢీకొని ఉండవచ్చని చెప్పారు. నేవీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అడ్మిరల్ యె సకాయ్ మాట్లాడుతూ ఒక ఫ్లైట్ నుంచి డేటా రికార్డర్, రెండు హెలికాప్టర్ల నుంచి ఒక బ్లేడ్, చాపర్ల శకలాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతానికి శిక్షణను నిలిపివేశామని వివరించారు.
ప్రమాదం జరిగినపుడు రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొని ఉండవచ్చని పేర్కొన్నారు. గల్లంతయిన వారి కోసం 12 యుద్ధనౌకలు, ఏడు విమానాలతో గాలిస్తున్నామని వెల్లడించారు. అలాగే కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ బోట్లు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో గల్లంతయిన వారి కోసం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ లో సాయం చేస్తామని అమెరికా రాయబారి తెలిపారు.