- గాల్లోకి లేచిన కొద్ది సెకన్లకే కూలిన లాంచ్ వెహికల్
- ప్రైవేట్ రాకెట్ సెక్టార్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ
టోక్యో: జపాన్‌లో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ‘కైరోస్’ ప్రయోగించిన కొన్ని సెకన్లకే భారీ శబ్దంతో పేలిపోయింది. బుధవారం వకయామా ప్రిఫెక్చర్ లోని ఓ దీవిలో కొండల మధ్య ఏర్పాటు చేసిన లాంచ్ ప్యాడ్ వద్ద ఈ ఘటన జరిగింది. స్పేస్ వన్ అనే ప్రైవేట్ స్టార్టప్ సంస్థ ఈ రాకెట్ ను తయారు చేసింది. వకయామాలో సముద్ర తీరంలోని కొండల మధ్య సొంత లాంచ్ ప్యాడ్ ను సిద్ధం చేసుకుంది. తొలి మిషన్ లో ప్రభుత్వానికి చెందిన చిన్న శాటిలైట్ ను కైరోస్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నించగా అది కూలిపోయింది.
రాకెట్ పైకి ఎగిరిన కొన్ని సెకన్లకే పేలిపోవడం, కొండలపై భారీ ఎత్తున మంటలు, పొగలు వ్యాపించడం, రాకెట్ శకలాలు మండుతూ కొండలపై పడిపోవడం వంటి దృశ్యాలు లైవ్ వీడియోల్లో రికార్డ్ అయ్యాయి. అయితే, కైరోస్ రాకెట్ వైఫల్యానికి కారణమేంటన్నది తెలియరాలేదు. జపాన్‌లో పలు ప్రైవేట్ కంపెనీలు కలిసి రాకెట్ లాంచింగ్ సెక్టార్ లోకి అడుగుపెడుతూ 2018లో స్పేస్ వన్ స్టార్టప్‌ను ప్రారంభించాయి. అన్ని ఏర్పాట్లు చేసుకుని బుధవారం తొలి మిషన్ కు సిద్ధం కాగా ఘోరమైన వైఫల్యం చవిచూశాయి. దీంతో జపాన్ ప్రైవేట్ రాకెట్ సెక్టార్‌కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.