ఆర్నెల్లలో అసెంబ్లీ ఎన్నికలు: జార్ఖండ్​లో అప్పుడే హడావుడి

జార్ఖండ్​లో మరో ఆర్నెల్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు అప్పుడే రెడీ అవుతున్నాయి. లేటెస్ట్ గా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ స్వీప్ చేసింది. మొత్తం 14 లోక్ సభ సీట్లలో 12 సీట్లను బీజేపీ కైవసం చేసుకుని సత్తా చాటింది. బీజేపీయేతర కూటమి కేవలం  రెండు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలైన జార్ఖండ్ ముక్తి మోర్చా ( జేఎంఎం), జార్ఖండ్ వికాస్ మోర్చా ( జేవీఎం) లు ఇప్పుడిప్పుడే కోలుకుని అసెంబ్లీ ఎన్నికలపై  దృష్టి పెడుతున్నాయి.

ఛోటానాగ్ పూర్ కౌలు చట్టం, సంతాల్ పరగణా కౌలు చట్టాలను సవరించడానికి  రఘుబర్ దాస్ నాయకత్వంలోని  రాష్ట్ర  ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ట్రైబల్ కమ్యూనిటీపై  వ్యతిరేక ప్రభావం చూపించింది. ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ముండా కమ్యూనిటీ ప్రజలు ఎక్కువగా ఉండే  కుంతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో  పథల్ గడి పేరుతో ఓ ఉద్యమం కూడా నడిచింది. అయితే ఆదివాసీల్లో నెలకొన్న వ్యతిరేకతను తొలగించడానికి బదులుగా ఉద్యమాన్ని అణచివేయడానికి  రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. సంతాల్ పరగణ తో పాటు లోహార్ దగ లోక్ సభ నియోజకవర్గాల్లోని  అనేక ప్రాంతాల్లో కూడా  రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అయితే తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఈ సీట్లలో బీజేపీ విజయం సాధించిన విషయం మరవరాదు.

అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్ ఇష్యూస్ దే మెయిన్ రోల్
లోక్ సభ ఎన్నికల ఫలితాలే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వస్తాయని అనుకోవడం కరెక్ట్ కాదన్నారు ఏఐసీసీ సెక్రెటరీ అరుణ్ ఓరాన్. లోక్ సభ ఎన్నికల్లో నేషనల్ ఇష్యూస్ డామినేట్ చేస్తే, అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్ ఇష్యూస్ దే మెయిన్ రోల్ అన్నారు ఆయన. కూటమిలోని పార్టీల మధ్య ఓట్ ట్రాన్స్ ఫర్  సరిగా జరగకపోవడమే లోక్ సభ ఎన్నికల్లో  కాంగ్రెస్ ఓటమికి  మెయిన్ రీజన్ అన్నారాయన. అంతేకాదు బూత్ మేనేజ్ మెంట్ లో కూడా కాంగ్రెస్ కేడర్ ఫెయిలైందన్నారు. రఘుబర్ దాస్ ప్రభుత్వం పై  అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత ఉండటం తో  ఆయా వర్గాలే తమంతట తాము పోలింగ్ బూత్ లకు వచ్చి తమకు అనుకూలంగా ఓటేస్తారని భావించామన్నారు అరుణ్ ఓరాన్. అయితే బూత్ మేనేజ్ మెంట్ ను  బీజేపీ సీరియస్ గా తీసుకుందని, వారికి అనుకూలురైన వారి ఓట్లు మొదటి రెండు మూడు గంటల్లోనే పోల్ అయ్యే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుందని ఆయన  చెప్పారు. దీంతో  కూటమి తప్పకుండా గెలుస్తుందనుకున్న  సీట్లు కూడా కోల్పోవాల్సి వచ్చిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అరుణ్ ఓరాన్.

కంచుకోటల్లోనూ ఓడిపోయిన జేఎంఎం
ఈసారి లోక్ సభ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చాకు కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో కూడా కూటమి ఓడిపోయింది. జేఎంఎంకు ధుమ్ కా సీటు సంప్రదాయంగా బలమున్న ప్రాంతం. గతంలో జేఎంఎం సీనియర్​ నేత శిబూ సోరెన్ ఇక్కడ్నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ధుమ్ కా లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఎస్టీలకు రిజర్వు చేసిన మూడు అసెంబ్లీ సీట్లు సికారిపారా, ధుమ్ కా, జామా తో పాటు జనరల్ సీట్లయిన నాలా, జంతారా, సారథ్ ఉన్నాయి. ఈసారి నాలా, జంతారా అసెంబ్లీ సీట్లలో బీజేపీకి భారీ మెజారిటీ వచ్చింది. కులపరమైన లెక్కల్లో తేడాలు రావడంతో  సంప్రదాయంగా జేఎంఎంకు అండగా నిలిచే కొన్ని కులాలు ఈసారి బీజేపీకి అనుకూలంగా స్టాండ్ తీసుకున్నట్లు పొలిటికల్ ఎనలిస్ట్ రమేష్ హెమ్ బ్రామ్ చెప్పారు. జనరల్ కేటగిరీలో ఉన్న  స్టీల్ సిటీ జెంషెడ్ పూర్ నియోజకవర్గం కూడా కొన్ని దశాబ్దాలుగా జేఎంఎంకు పెట్టని కోటవంటిది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ కేండిడేట్ గా పోటీ చేసిన విద్యుత్ బరన్ మహతో,  జేఎంఎం అభ్యర్థి చంపాయ్ సోరెన్ పై  విజయం సాధించారు. కుర్మీ, మహతో కులాలకు సంబంధించిన ప్రజలు ఈ నియోజకవర్గ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉంటారు. జంషెడ్ పూర్ లో జేఎంఎం తరఫున మహతో కేండిడేట్ బరిలోకి దిగి ఉంటే పరిస్థితి వేరేగా ఉంటుందన్నారు రాజకీయ విశ్లేషకులు. లోక్ సభ ఎన్నికల ప్యాటర్న్ కు ,  అసెంబ్లీ ఎన్నికలకు తప్పకుండా తేడా ఉంటుందన్నారు శైలేంద్ర మహతో అనే స్థానిక ఓటరు.

అసెంబ్లీ ఎన్నికలపై  ఓటమి ప్రభావం ?

మరోసారి అదే నినాదం
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతుంటే మరోవైపు సీఎం రఘుబర్ దాస్ అప్పుడే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేయడం మొదలెట్టారు. ట్రైబల్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్ వంటి సంతాల్ పరగణా సెగ్మెంట్​లోని అన్ని అసెంబ్లీ సీట్లను బీజేపీ ఖాతాలో వేయడానికి ఇప్పటి నుంచే పకడ్బందీ ప్లాన్లు రెడీ చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలప్పుడు ఇచ్చిన ‘జేఎంఎం ముక్త్ జార్ఖండ్’ నినాదాన్ని మరోసారి ఉపయోగించాలని డిసైడ్ అయినట్లు  తెలుస్తోంది. లోక్​సభ ఎన్నికల ఫలితాలే అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్​ అవుతాయన్న ధీమా ఆయన వ్యక్తం చేశారు.

ఈసారి పక్కా ప్లాన్: హేమంత్
లోక్ సభ ఎన్నికల్లో  ఓటమిపై పార్టీ లీడర్లతో  జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్ కొన్ని రోజుల కిందట సమీక్ష జరిపారు. కూటమిలోని పార్టీల మధ్య  కో ఆర్డినేషన్ సరిగా లేదని సమీక్ష సందర్భంగా ఆయన అన్నట్లు రాజకీయవర్గాల సమాచారం. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ  బీజేపీయేతర కూటమి కొనసాగుతుందని సోరెన్ చెప్పారు. బీజేపీని ఓడించడానికి అసెంబ్లీ ఎన్నికలకు కూటమి పక్కా  ప్లాన్ తో ముందుకు వెళుతుందని ఆయన అన్నారు.

బీజేపీ రికార్డు
జార్ఖండ్ అసెంబ్లీలో  మొత్తం సభ్యుల సంఖ్య 81. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 42 సీట్లు గెలుచుకుంది. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక సింగిల్ పార్టీ కి మేజిక్ ఫిగర్ ( 41 ) రావడం ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన మిత్రపక్షాలైన
జార్ఖండ్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ జనతాదళ్ ( ఆర్జేడీ), జనతాదళ్ (యునైటెడ్) తో కలిసి కూటమిగా పోటీ చేశాయి.

19 ఏళ్లలో 10 మంది ముఖ్యమంత్రులు
జార్ఖండ్ రాష్ట్రం 2000 నవంబర్ 15 న ఏర్పడింది.అడవులకు, అపార ఖనిజసంపదకు పేరొందిన ఈ రాష్ట్రం బీహార్ నుంచి వేరు పడింది. రాజకీయ అస్థిరతకు కేరాఫ్ అడ్రస్ గా జార్ఖండ్ నిలిచింది. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ 19 ఏళ్ల కాలంలో  మొత్తం 10 మంది ముఖ్యమంత్రులు వచ్చారు. 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ సీనియర్ లీడర్ రఘువర్ దాస్ జార్ఖండ్ పదో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోనున్న తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రకెక్కనున్నారు.

మోడీ ప్రచారమంతా విద్వేషమే
లోక్ సభ ఎన్నికల సందర్బంగా నరేంద్ర మోడీ ప్రచారమంతా విద్వేషంతోనే సాగింది. కాంగ్రెస్ మాత్రం ఆప్యాయతతో జనం దగ్గరకు వెళ్లింది. కాంగ్రెస్ కు అండగా నిలబడ్డందుకు కేరళ ప్రజలకు కృతజ్ఞతలు. వయనాడ్ ప్రజలకు అందుబాటులో ఉంటా.
– రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్

అందరి బాగు కోసం కృషి చేస్తాం
దేశంలోని అన్ని వర్గాల బాగు కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేసిన వారు కూడా మా వైపు ఉన్నట్లే భావిస్తున్నాం. బీజేపీకి ఎన్నికల్లో గెలుపోటములే ముఖ్యం కాదు. దేశాభివృద్ధే లక్ష్యం. – నరేంద్ర మోడీ, ప్రధాని

బీజేపీ ఆఫీసులో సుమలత
తాజా లోక్​సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్య సెగ్మెంట్​ నుంచి గెలిచి ఎంపీ అయిన సీనియర్​ నటి సుమలతా అంబరీశ్​​ శనివారం బెంగళూరులోని బీజేపీ ఆఫీసుకు వెళ్లారు. ఎలక్షన్​లో ఇండిపెండెంట్​గా పోటీ చేసిన ఆమెకు కమలదళం సపోర్ట్​ చేసింది. ఈ నేపథ్యంలో సుమలత ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.