పౌలిని X క్రెజికోవా .. శనివారం టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌

  • వింబుల్డన్‌‌‌‌ ఫైనల్లోకి ప్రవేశం

లండన్‌‌‌‌: తొలి సెట్‌‌‌‌లో ఓడినా.. తర్వాతి రెండు సెట్లలో పోరాట స్ఫూర్తి చూపెట్టిన ఇటలీ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ జాస్మిన్‌‌‌‌ పౌలిని.. వింబుల్డన్‌‌‌‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో ఏడోసీడ్‌‌‌‌ పౌలిని 2–6, 6–4, 7–6 (10/8)తో డోనా వెకిచ్‌‌‌‌ (క్రొయేషియా)పై గెలిచింది. 2 గంటలా 51 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌ వింబుల్డన్‌‌‌‌లోనే అత్యంత సుదీర్ఘమైన సెమీస్‌‌‌‌ పోరుగా రికార్డులకెక్కింది. 2009లో సెరెనా విలియమ్స్‌‌‌‌.. ఎలెనా డిమెంటీవా మధ్య 2 గంటల 49 నిమిషాల మ్యాచ్‌‌‌‌ ఇప్పటి వరకు రికార్డుగా ఉండేది.

ఇక ఓపెన్‌‌‌‌ ఎరాలో ఫైనల్‌‌‌‌ చేరిన తొలి ఇటాలియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా పౌలిని రికార్డు సృష్టించింది. నెల రోజుల కిందట రోలాండ్‌‌‌‌ గారోస్‌‌‌‌లో రన్నరప్‌‌‌‌గా నిలిచిన పౌలిని వెంటనే వింబుల్డన్‌‌‌‌ ఫైనల్లోకి చేరుకుంది. ఫలితంగా 2016లో సెరెనా విలియమ్స్‌‌‌‌ (ఫ్రెంచ్‌‌‌‌, వింబుల్డన్‌‌‌‌) తర్వాత ఒకే సీజన్‌‌‌‌లో రెండు మేజర్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌కు చేరుకున్న తొలి ప్లేయర్‌‌‌‌గా నిలిచింది. ఓవరాల్‌‌‌‌గా స్టెఫీ గ్రాఫ్‌‌‌‌ (1999), సెరెనా (2002, 2015, 2016), వీనస్‌‌‌‌ (2002), జస్టిన్‌‌‌‌ హెనిన్‌‌‌‌ (2006) తర్వాత ఈ ఘనత సాధించిన ఐదో ప్లేయర్‌‌‌‌ పౌలిని. వెకిచ్‌‌‌‌తో తలపడిన నాలుగుసార్లలో పౌలినికి ఇది మూడో విజయం కావడం విశేషం.

సుదీర్ఘంగా జరిగిన పోరాటంలో ఇటాలియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ తొలిసెట్‌‌‌‌ చేజార్చుకున్నా చివరి రెండు సెట్లలో అద్భుతంగా పుంజుకుంది. మ్యాచ్‌‌‌‌ మొత్తంలో 7 ఏస్‌‌‌‌లు కొట్టిన వెకిచ్‌‌‌‌ 7 డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌ చేసింది. 14 బ్రేక్‌‌‌‌ పాయింట్లలో నాలుగింటినే కాచుకుంది. 57 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌తో మూల్యం చెల్లించుకుంది. ఇక పౌలిని 5 ఏస్‌‌‌‌లు, మూడు డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌తో పాటు మూడు బ్రేక్‌‌‌‌ పాయింట్లను కాపాడుకుంది. 32 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌ చేసినా తన సర్వీస్‌‌‌‌లో ఎక్కువ పాయింట్లు నెగ్గింది.  

రిబకినాకు షాక్‌‌‌‌..

మరో సెమీస్‌‌‌‌లో నాలుగోసీడ్‌‌‌‌ ఎలీనా రిబకినా (కజకిస్తాన్‌‌‌‌)కు ఊహించిన షాక్‌‌‌‌ ఎదురైంది. 31వ సీడ్‌‌‌‌ బార్బోరా క్రెజికోవా (చెక్‌‌‌‌) 3–6, 6–3, 6–4తో రిబకినాపై గెలిచింది. 2021 రోలాండ్‌‌‌‌ గారోస్‌‌‌‌ టైటిల్‌‌‌‌ తర్వాత ఆమెకు ఇదే తొలి ఫైనల్‌‌‌‌. 2 గంటలా 7 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో రిబకినా 8 ఏస్‌‌‌‌లు సంధించినా ప్రయోజనం దక్కలేదు. మూడు డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌తో పాటు 37 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌తో మూల్యం చెల్లించుకుంది. 9 బ్రేక్‌‌‌‌ పాయింట్లలో మూడింటిని కాచుకుంది. ఇక క్రెజికోవా 4 ఏస్‌‌‌‌లు, 6 డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌తో పాటు 4 బ్రేక్‌‌‌‌ పాయింట్లను కాపాడుకుంది. 71 శాతం నెట్‌‌‌‌ పాయింట్స్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ను సొంతం చేసుకుంది.