- ఐసీసీ ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా జస్‌ప్రీత్
- స్మృతికి వన్డే బెస్ట్ ప్లేయర్ అవార్డు
దుబాయ్ : టీమిండియా పేస్ లీడర్ జస్‌ప్రీత్ బుమ్రా, విమెన్స్ టీమ్ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డులు కైవసం చేసుకున్నారు. 2024 సీజన్‌కు గాను టెస్టు ఫార్మాట్‌లో బుమ్రా బెస్ట్ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. విమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా స్మృతి మంధానను ఎంపిక చేసినట్టు ఐసీసీ సోమవారం ప్రకటించింది. గతేడాది టెస్టుల్లో బుమ్రా సూపర్ పెర్ఫామెన్స్ చేశాడు. 13 మ్యాచ్‌ల్లో 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఒకే ఏడాది టెస్టుల్లో 70 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఇండియా నాలుగో బౌలర్‌గా నిలిచాడు. టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికవడం పట్ల బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు. టెస్టు ఫార్మాట్ తన మనసుకెప్పుడూ దగ్గరగా ఉంటుందన్నాడు. పలు విజయాలను, పాఠాలను అందించిన గతేడాది తనకెంతో ప్రత్యేకమని చెప్పాడు. వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్ క్రికెటర్ ఒలీ పోప్ వికెట్ స్పెషల్ అన్నాడు. బుమ్రా ఐసీసీ టెస్టు టీమ్‌లోనూ చోటు దక్కించుకున్నాడు. ఇక, ఇప్పటికే ఐసీసీ విమెన్స్ టీ20, వన్డే టీమ్స్‌కు ఎంపికైన మంధాన వన్డే క్రికెటర్ అవార్డును కూడా ఖాతాలో వేసుకుంది.
ఇండియా విమెన్స్ వైస్ కెప్టెన్ స్మృతి గతేడాది 13 వన్డేల్లో అత్యధికంగా 747 రన్స్‌తో సత్తా చాటింది. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. జూన్‌లో వరుసగా రెండు సెంచరీలు కొట్టడంతో సౌతాఫ్రికాతో సిరీస్‌ను ఇండియా 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో సిరీస్ చివరి వన్డేలో ఇంకో సెంచరీ కొట్టి జట్టును గెలిపించింది. డిసెంబర్‌లో ఆస్ట్రేలియాపై (పెర్త్‌లో) మరో సెంచరీతో మెరిసింది.