![చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా సిద్ధమేనా?](https://static.v6velugu.com/uploads/2025/02/jasprit-bumrah-champions-trophy-fate-hangs-in-balance-fitness-test-results-awaited_PTi4Kwn9FH.jpg)
- ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ టెస్టుకు హాజరైన స్టార్ పేసర్
న్యూఢిల్లీ: టీమిండియా స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా.. చాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న అతనికి బెంగళూరులోని ఎన్‌సీఏలో శుక్రవారం అన్ని రకాల ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించారు. రాబోయే 24 గంటల్లో ఈ టెస్ట్‌లకు సంబంధించి పూర్తి నివేదిక రానుంది. దీంతో మరో రోజు ఎన్‌సీఏలోనే ఉండనున్న బుమ్రా.. రిపోర్ట్‌లోని అంశాలను బీసీసీఐ మెడికల్ టీమ్‌తో చర్చించనున్నాడు.
ఆ తర్వాత నివేదికను టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సమర్పించనున్నారు. రిపోర్ట్ రెడీ అయిన తర్వాత గతంలో బుమ్రా వెన్నుకు సర్జరీ చేసిన డాక్టర్ రోవన్ స్కౌటెన్ సలహాలను కూడా తీసుకోనున్నారు. ఆస్ట్రేలియా టూర్ సందర్భంగా జనరిలో తీసిన మొదటి స్కానింగ్ రిపోర్ట్స్‌ను ఇప్పటికే రోవన్‌తో చర్చించారు.
ఇక, చాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో మార్పులు, చేర్పులకు ఈనెల 12వ తేదీ వరకు టైమ్ ఉండటంతో ఆలోగా బుమ్రా విషయాన్ని తేల్చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు బుమ్రా ప్లేస్‌లో వరుణ్ చక్రవర్తిని తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే చాంపియన్స్ ట్రోఫీకి కూడా బుమ్రా అందుబాటులో లేకపోతే వరుణ్, హర్షిత్ రాణాలో ఒకరికి చోటు దక్కే అవకాశాలున్నాయి.