IND vs BAN 2024: అంతర్జాతీయ క్రికెట్‌లో అదుర్స్.. 400 వికెట్ల క్లబ్‌లో బుమ్రా

అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన హవా కొనసాగిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా తన  పేస్ తో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. తాజాగా ఈ గుజరాత్ ఫాస్ట్ బౌలర్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో 400 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. చెన్నై వేదికగా ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో హసన్ మహ్మద్ వికెట్ తీసి ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో మొత్తం నాలుగు వికెట్లు తీసుకున్న బుమ్రా..తన వికెట్ల సంఖ్యను 401కు పెంచుకున్నాడు. 

ఈ మ్యాచ్ లో తొలి బంతికే వికెట్ ను తీసుకున్న బుమ్రా.. రహీం, తస్కిన్ అహ్మద్, హసన్ మహమ్మద్ వికెట్లను పడగొట్టాడు. 2016 లో తొలిసారి బుమ్రా ఆస్ట్రేలియాపై వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. 2016 లోనే తొలిసారి టీ20 ఆడగా.. 2018లో తొలిసారిగా టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 89 వన్డేల్లో 149 వికెట్లు.. 70 టీ20 మ్యాచ్ ల్లో 89 వికెట్లు.. 39 టెస్ట్ మ్యాచ్ ల్లో 159 వికెట్లు పడగొట్టాడు. 

చెన్నైలో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ లో 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజ్ లో గిల్ (21) కోహ్లీ (7) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 376 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 149 పరుగులు మాత్రమే చేయగలిగింది.