IPL 2025: మరో రెండు మ్యాచ్‌లకు దూరం.. బుమ్రా ఐపీఎల్‌లో అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

IPL 2025: మరో రెండు మ్యాచ్‌లకు దూరం.. బుమ్రా ఐపీఎల్‌లో అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పటిలాగే ఈ సీజన్ కూడా పేలవంగా ప్రారంభించింది. లీగ్ ప్రారంభంలో ఆడిన రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది. కోల్ కతాతో జరిగిన మూడో మ్యాచ్ లో గెలిచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. బుమ్రా ఉంటే ముంబై మరింత పటిష్టంగా మారడం ఖాయం. ముంబై ఫ్యాన్స్ కూడా ఈ స్టార్ బౌలర్ కోసం ఎదురు చూస్తున్నారు. బుమ్రాపై ఐపీఎల్ 2025 లో ఎప్పుడు బరిలోకి దిగుతాడో ఒక క్లారిటీ వచ్చేసింది. 

బుమ్రా గాయం నుంచి కోలుకొని పూర్తి ఫిట్ నెస్ సాధించినట్టు స్పష్టమవుతోంది. రిపోర్ట్స్ ప్రకారం బుమ్రా గాయం నుంచి కోలుకున్నా అతని రాక కొంత ఆలస్యం కానుంది. ముంబై ఇండియన్స్ ఆడబోయే తదుపరి రెండు మ్యాచ్ లకు ఈ ఫాస్ట్ బౌలర్ దూరం కానున్నాడు. ఏప్రిల్ 4న లక్నో సూపర్ జయింట్స్ తో జరగబోయే మ్యాచ్ తో పాటు.. ఏప్రిల్ 7న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడబోయే మ్యాచ్ కు దూరంగా ఉండనున్నారు. ఏప్రిల్ 13 న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరగబోయే మ్యాచ్ కు బుమ్రా అందుబాటులో ఉండనున్నాడు.

జూన్ నెలలో ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఐపీఎల్ తర్వాత రెండు వారాల్లో ఇంగ్లాండ్ కు భారత్ పయనం కావాల్సి ఉంది. టెస్ట్ ఛాంపియన్స్ షిప్ లో కీలకంగా మారిన ఈ సిరీస్ లో బుమ్రా ఆడడం చాలా కీలకం. ఈ సుదీర్ఘ సిరీస్ కు బుమ్రా తాజాగా ఉండాలంటే అతనికి మరింత రెస్ట్ బీసీసీఐ భావిస్తోందట. పైగా ఈ సిరీస్ కు రోహిత్ స్థానంలో టెస్ట్ కెప్టెన్ గా బుమ్రాను ఎంపిక చేయడం దాదాపుగా ఖరారైంది. దీంతో బుమ్రాను బీసీసీఐ ఉన్నపళంగా ఐపీఎల్ ఆడించేందుకు రిస్క్ చేయడం లేదు. 

►ALSO READ | 2 కోట్లతో మొదలు పెట్టి.. 12 కోట్లు: ఐపీఎల్ ద్వారా భారీగా సంపాదించిన మహ్మద్ సిరాజ్

గతేడాది భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆటకు దూరమై సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకున్నాడు. గాయం కారణంగా ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫికీ కూడా బుమ్రా దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) పర్యవేక్షణలో ఉన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు రూ.18 కోట్ల రూపాయలతో ఈ టీమిండియా పేసర్ ను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంది. బుమ్రా లేకపోవడం ముంబైకి అతి పెద్ద మైనస్ కానుంది. బుమ్రా లేకపోయినా ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్ లతో ముంబై పటిష్టంగానే కనిపిస్తుంది. ఇప్పటివరకు 133 మ్యాచ్ ల్లో 7.3 ఎకనామితో బుమ్రా 165 వికెట్లు పడగొట్టాడు. రెండు సార్లు 5 వికెట్లు ఘనత అందుకున్నాడు.