Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్ వంకరగా ఉంటది.. పొగడ్తలు, విమర్శలు రెండూ కురిపించిన పాక్ మాజీ

Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్ వంకరగా ఉంటది.. పొగడ్తలు, విమర్శలు రెండూ కురిపించిన పాక్ మాజీ

భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు, పీసీబీ మాజీ చైర్మన్ రమీజ్ రాజా ప్రశంసలు కురిపించాడు. అతనిలో ప్రతిభను ముందే గుర్తించానన్న పాక్ మాజీ, టీ20 ప్రపంచకప్ 2024లో అతని ప్రదర్శన అద్భుతమని కొనియాడాడు. బుమ్రాను ఆల్-ఫార్మాట్ లెజెండ్ అని ప్రశంసించాడు. అదే సమయంలో అతని బౌలింగ్ యాక్షన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. 

రమీజ్ రాజా వ్యాఖ్యల్లో వాస్తవం లేకపోలేదు. ప్రస్తుత తరుణంలో బుమ్రా ఖచ్చితంగా ఒక ప్రమాదకరమైన బౌలర్‌. ఒకవేళ అతను జట్టులో లేకపోతే.. ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఒంటి చేత్తో విజయాన్ని అందించగల సమర్థుడు. టీమిండియా పొట్టి ప్రపంచకప్‌ విశ్వ విజేతగా నిలిచిందంటే బుమ్రా పాత్ర మరువలేనిది. 8 మ్యాచ్‌ల్లో 4.18 ఎకానమీ రేటుతో 15 వికెట్లు పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. 

ఈ గణాంకాలు సాధారణ బౌలర్‌కు సాధ్యమయ్యేవి కావు. ఇదే విషయాన్ని రమీజ్ రాజా ప్రస్తావించాడు. ఆఖరి ఓవర్లలో బుమ్రా బౌలింగ్‌లో ఆరేడు పరుగులు చేయాలన్నా.. బ్యాటర్లు శ్రమించాల్సి వస్తున్న విషయాన్ని పాక్ మాజీ ప్రత్యేకంగా వివరించాడు. సుధీరర్ఘ ఫార్మాట్‌లోనూ అతని ఎదుర్కోవడం అంత సులువైన పని కాదని బ్యాటర్లకు గుర్తు చేశాడు.     

"నా వరకూ జస్ప్రీత్ బుమ్రా మూడు ఫార్మాట్లలో ఒక లెజెండ్. మూడు ఫార్మాట్లలో ఆడిన గొప్పవాడు ఎవరూ లేరు. (ఆప్ దేఖ్ రహే హై, ఏక్ లడ్కా కహా సే ఉతా హై, ఉస్మే కాన్ఫిడెన్స్ నహీ థా). ఇతను ఎక్కడ నుండి వచ్చాడో కానీ, బ్యాటర్లకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు. అలా అని అతనికి విశ్వాసం లేదు. ఇబ్బందికర బౌలింగ్ యాక్షన్ మాత్రమే ఉంది. నిజానికి అతను అనర్హుడు, కానీ తిరిగొచ్చాడు. భారతదేశాన్ని ప్రపంచ కప్ గెలుచుకునేలా చేసాడు.." అని రమీజ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

కాగా, టీ20 ప్రపంచ కప్ విజయానంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు పొట్టి ఫార్మాట్ నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో బుమ్రా రిటైర్మెంట్ గురించి అడగ్గా.. ఇప్పట్లో ఉండదని తేల్చి చెప్పాడు. "నా రిటైర్మెంట్ చాలా దూరంలో ఉంది. నేను ఇప్పుడే మొదలు పెట్టాను.. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి.." అని బుమ్రా వ్యాఖ్యానించాడు.

భారత్ తరఫున ఇప్పటివరకు 36 టెస్టులు ఆడిన బుమ్రా 20.70 సగటుతో 159 వికెట్లు పడగొట్టాడు. 89 వన్డేల్లో 23.55 సగటుతో 149 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20ల్లో 17.74 సగటుతో 89 వికెట్లు పడగొట్టాడు.