IND Vs PAK: పాకిస్థాన్‌తో హై వోల్టేజ్ మ్యాచ్.. దుబాయ్ స్టేడియానికి చేరుకున్న బుమ్రా

IND Vs PAK:  పాకిస్థాన్‌తో హై వోల్టేజ్ మ్యాచ్.. దుబాయ్ స్టేడియానికి చేరుకున్న బుమ్రా

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం (ఫిబ్రవరి 23) జరగబోయే మ్యాచ్ కోసం టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దుబాయ్ చేరుకున్నాడు. అదేంటి బుమ్రాకి గాయమైంది కదా దుబాయ్ ఎందుకు వచ్చాడనుకోవచ్చు. అయితే బుమ్రా దుబాయ్ వెళ్ళింది మ్యాచ్ ఆడడానికి కాదు. స్టేడియంలో మ్యాచ్ చూడడానికి. ఈ టీమిండియా పేసర్ ఇండియాకు సపోర్ట్స్ చేస్తూ స్టేడియంలో మ్యాచ్ ఎంజాయ్ చేయనున్నాడు. మ్యాచ్ కు సరిగా ఒక గంట ముందు బుమ్రా స్టేడియానికి చేరుకున్నాడు. ఈ టీమిండియా పేసర్ దుబాయ్ రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

గ్రౌండ్ లో విరాట్ కోహ్లీని కలిసి హగ్ ఇచ్చాడు. ఐసీసీ చైర్మన్ జై షాతో కలిసి గ్రౌండ్ లో కాసేపు ముచ్చటించాడు. బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో బుమ్రాకు గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువ కావడంతో అతను ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. బుమ్రా లేకపోవడంతో భారత్ బౌలింగ్ లో బలహీనంగా కనిపిస్తుంది. అతడు లేకపోవడంతో యువ పేసర్ హర్షిత్ రాణాకు ప్లేయింగ్ 11 లో చోటు దక్కింది. నేడు పాక్ తో జరగనున్న మ్యాచ్ లోనూ తుది జట్టులో స్థానం సంపాదించాడు.

Also Read :  టాస్ ఓడిన భారత్.. పాకిస్థాన్ బ్యాటింగ్

  
ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియాకు షాక్ ఇవ్వాలని పాక్ చూస్తుంది. మరోవైపు చిరకాల ప్రత్యర్థిని ఓడించి రాయల్ గా సెమీస్ లోకి అడుగు పెట్టాలని రోహిత్ సేన భావిస్తుంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. గాయపడిన ఫకర్ జమాన్ స్థానంలో ఇమాముల్ హక్ వచ్చాడు. మరోవైపు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది.