Jasprit Bumrah: ఇంగ్లాండ్ సిరీస్ కు బుమ్రా దూరం.. ఛాంపియన్స్ ట్రోఫీకి డౌట్

Jasprit Bumrah: ఇంగ్లాండ్ సిరీస్ కు బుమ్రా దూరం.. ఛాంపియన్స్ ట్రోఫీకి డౌట్

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం వెన్ను నొప్పి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో బుమ్రాను వెన్ను గాయం బాధించింది. దీంతో మ్యాచ్ మధ్యలోనే చికిత్స కోసం హాస్పిటల్ కు వెళ్ళాడు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయడానికి రాలేదు. బుమ్రా గాయంపై ఎలాంటి సమాచారం లేదు. అతను కోలుకోవడానికి చాలానే సమయం పట్టవచ్చు. దీంతో భారత్ ఇంగ్లాండ్ పై ఆడబోయే వైట్ బాల్ సిరీస్ కు బుమ్రా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

గాయం తగ్గినా బుమ్రాపై పని భారం తగ్గించాలనే ఉద్దేశ్యంలో బీసీసీఐ అతనికి రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి.ఈ సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు బుమ్రా దూరమవ్వడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. బుమ్రా గాయం తీవ్రత ఎక్కవైతే మాత్రం ఈ ఫాస్ట్ బౌలర్ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీ నుంచి దూరమైనా ఆశ్చర్యం లేదు. 

ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరమైతే భారత్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టే. అతన్ని రీప్లేస్ చేసే ఆటగాళ్లు ఎవరూ లేకపోవడమే ఇందుకు కారణం. ఇటీవలే ముగిసిన బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో 150 ఓవర్లకు పైగా బౌలింగ్ చేసిన 30 ఏళ్ల పేసర్.. 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్న బుమ్రా టాప్ ర్యాంక్ ను మరింత పదిలం చేసుకున్నాడు. 

భారత్ vs ఇంగ్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్

జనవరి 22: తొలి టీ20 (కోల్ కతా)
జనవరి 25: రెండో టీ20 (చెన్నై)
జనవరి 28: మూడో టీ20 (రాజ్ కోట్)
జనవరి 31: నాలుగో టీ20 (పుణె)
ఫిబ్రవరి 2: ఐదో టీ20 (ముంబై)

వన్డే సిరీస్ షెడ్యూల్

ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్ పూర్)
ఫిబ్రవరి 9: రెండో వన్డే (కటక్)
ఫిబ్రవరి 12: మూడో వన్డే (అహ్మదాబాద్)