Champions Trophy 2025: టీమిండియాకు షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లకు బుమ్రా దూరం

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. బుమ్రా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతను ఈ మెగా టోర్నీ ప్రారంభ మ్యాచ్ లకు దూరం కానున్నాడని సమాచారం. శనివారం (జనవరి 11) ముంబైలో సమావేశమైన జాతీయ సెలక్టర్లు బుమ్రాపై ఒక అంచనాకు రాలేకపోతున్నారు. సెలక్టర్లు బుమ్రాను 15 మందితో కూడిన జట్టులో చేర్చాలా లేదా టోర్నమెంట్ కోసం రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో చేర్చాలా అని ఆలోచిస్తున్నారు. బుమ్రా వెన్ను గాయం గురించి అప్ డేట్ ఇవ్వాల్సిందిగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీని కోరినట్టు తెలుస్తుంది. 

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ మొదట అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు తాత్కాలిక జట్టును సమర్పించనుందని సమాచారం. ఇలా చేస్తే ఫిబ్రవరి 12 వరకు జట్లలో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. టోర్నమెంట్ ప్రారంభం సమయానికి బుమ్రా ఫిట్ నెస్ సాధిస్తే సెలక్ట్ చేయొచ్చు. వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం మార్చి మొదటి వారం నాటికి బుమ్రా పూర్తిగా ఫిట్‌గా ఉంటాడని తెలుస్తుంది. బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తాడని.. మూడు వారాల పాటు అక్కడే ఉంటాడని నివేదికలు చెబుతున్నాయి. పూర్తి ఫిట్ నెస్ సాధించిన తర్వాత రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాలి ఉంటుంది.

న్యూజిలాండ్‌తో భారత్ చివరి గ్రూప్ మ్యాచ్ మార్చి 2న జరగనుంది. ఈ మ్యాచ్ ఆడేందుకు బుమ్రా సిద్ధంగా ఉండొచ్చు. అదే జరిగితే తొలి రెండు మ్యాచ్ లకు బుమ్రా దూరం కానున్నాడు. బుమ్రా లేకుండానే భారత్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో.. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్ లు ఆడనుంది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో బుమ్రా 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సిరీస్ లో చివరిదైన సిడ్నీ టెస్ట్ ఆడుతూ బుమ్రా గాయపడ్డాడు.