కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టుల్లో భారత్ పట్టు బిగిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే చిత్తయిన సఫారీలు రెండో ఇన్నింగ్స్ లోనే అదే దారిలో పయనిస్తోంది. 3 వికెట్లకు 62 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా భారత పేసర్ బుమ్రా ధాటికి విలవిల్లాడుతుంది. ఓవర్ నైట్ రెండు వికెట్లు పడగొట్టిన బుమ్రా.. అదే ఫామ్ ను రెండో రోజు కొనసాగిస్తున్నాడు. వికెట్ కీపర్ వెర్రాయిన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్ వెనక్కి పంపిన ఈ స్టార్ పేసర్ 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా 27 ఓవర్లలో 7 వికెట్లకు 128 పరుగులు చేసింది. మార్కరం 73 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మరో ఎండ్ లో రబడా(1) ఉన్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 30 పరుగుల ఆధిక్యంలో ఉంది. మిగిలిన మూడు వికెట్లను భారత్ ఎంత త్వరగా తీయగలిగితే రెండో రోజే మ్యాచ్ ముగిసిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.
తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్ కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 153 పరుగులకు ఆలౌట్ కావడంతో 98 పరుగుల ఆధిక్యం లభించింది. టీ విరామ సమయానికి 111/4 స్కోరుతో ఉన్న టీమిండియా.. చివరి సెషన్ మొదలైన తొలి 8 ఓవర్లలోనే మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. కేవలం 11 బంతుల్లో మ్యాచ్ తలకిందులైపోయింది. భారీ ఆధిక్యం ఖాయమన్న దశలో స్వల్ప ఆధిక్యంతో సరిపెట్టుకుంది.