ముంబై : ఆసియా కప్, వరల్డ్ కప్ ముంగిట టీమిండియాకు గుడ్‌న్యూస్. గాయపడ్డ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పూర్తిగా కోలుకొని రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. కారు యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాలపాలైన కీపర్ రిషబ్ పంత్ చాన్నాళ్ల తర్వాత మళ్లీ బ్యాటు పట్టి నెట్ ప్రాక్టీస్ షురూ చేశాడు. ఈ ఇద్దరితో పాటు బెంగళూరు ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన్న ప్రసిధ్ కృష్ణ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మెడికల్, ఫిట్‌నెస్‌పై శుక్రవారం బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది.
బోర్డు రిపోర్టు ప్రకారం పేసర్లు బుమ్రా, ప్రసిధ్ రిహాబిలిటేషన్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. నెట్స్‌లో ఇద్దరూ పూర్తి స్థాయిలో బౌలింగ్ చేస్తున్నారు. ఎన్‌సీఏ నిర్వహించే కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో పాల్గొన్న తర్వాత ఈ ఇద్దరి ఫిట్‌నెస్‌పై బీసీసీఐ మెడికల్ సెలెక్టర్లకు రిపోర్టు ఇవ్వనుంది. బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ నెట్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రస్తుతం స్ట్రెంత్, ఫిట్‌నెస్ డ్రిల్స్‌లో పాల్గొంటున్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్స్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ట్రెయినింగ్ తీవ్రతను బోర్డు మెడికల్ టీమ్ పెంచనుంది. ఇక, రిషబ్ పంత్ చాలా ఇంప్రూవ్‌మెంట్ చూపెట్టాడు. నెట్స్‌లో బ్యాటింగ్, కీపింగ్ ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. స్ట్రెంత్, ఫ్లెక్సిబులిటీ, రన్నింగ్ అంశాలతో తన కోసం రూపొందించిన ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను ఫాలో అవుతున్నాడని బోర్డు వెల్లడించింది.