IND vs AUS: చెలరేగుతున్న బుమ్రా.. ఆసీస్ టాపార్డర్ కకావికలం

IND vs AUS: చెలరేగుతున్న బుమ్రా.. ఆసీస్ టాపార్డర్ కకావికలం

పెర్త్ టెస్టులో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆతిధ్య ఆసీస్ జట్టును ఒక ఆటాడుకుంటున్నాడు. వరుస పెట్టి వికెట్లు తీస్తూ భారత శిబిరంలో ఆనందాన్ని నింపుతున్నాడు. అప్పుడే మూడు వికెట్లు తీసి భారత్ ను మ్యాచ్ లో నిలిపాడు. బుమ్రా విజృంభించడంతో ఆస్ట్రేలియా 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడు వికెట్లు బుమ్రాన్ తీసుకోవడం విశేషం. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 131 పరుగులు వెనకబడి ఉంది.     

తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ కు ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ రెండు ఫోర్లు కొట్టి మంచి టచ్ లో కనిపించాడు. ఈ దశలో బుమ్రా అతన్ని ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనక్కి పంపాడు. ఆ తర్వాత తన ఓవర్ లో రెండు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ ఇచ్చాడు. ఏడో ఓవర్ నాలుగో బంతికి ఖవాజాను వెనక్కి పంపిన బుమ్రా.. ఆ తర్వాత అద్భుత బంతితో స్టీవ్ స్మిత్ ను ఔట్ చేశాడు. దీంతో వికెట్ నష్టపోకుండా 14 పరుగులతో ఉన్న ఆస్ట్రేలియా ఒక్కసారిగా 3 వికెట్ల నష్టానికి 19 పరుగులతో కుప్పకూలింది.

అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశపరిచింది. రిషబ్ పంత్(37) , తెలుగు కుర్రాడు నితీష్  కుమార్ రెడ్డి(41) మినహాయిస్తే మిగిలిన వారందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ధాటికి తలవంచుతూ కేవలం 150 పరుగులకే ఆలౌటయ్యారు.