దుబాయ్: ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కొత్త రికార్డును నమోదు చేశాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా 907 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. తద్వారా 2016లో అశ్విన్ సాధించిన అత్యధిక రేటింగ్ పాయింట్ల (904) రికార్డును బ్రేక్ చేశాడు. ఇండియా తరఫున ఆల్‌టైమ్ రేటింగ్ పాయింట్లు ఇవే కావడం విశేషం. ఓవరాల్ లిస్ట్‌లో డెరెక్ అండర్‌వుడ్ (ఇంగ్లండ్)తో కలిసి బుమ్రా సంయుక్తంగా17వ ప్లేస్‌లో ఉన్నాడు.
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందే బుమ్రా.. అశ్విన్ రేటింగ్ రికార్డును సమం చేశాడు. ఎంసీజీలో జరిగిన నాలుగో టెస్ట్‌లో 9 వికెట్లు తీయడంతో అటు నంబర్‌వన్ ర్యాంక్‌తో పాటు రేటింగ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. హాజిల్‌వుడ్ (843), కెప్టెన్ కమిన్స్ (837) రెండు, మూడో ర్యాంక్‌ల్లో ఉన్నారు. బ్యాటింగ్ కేటగిరీలో యశస్వి జైస్వాల్ (854) ఒక్క ప్లేస్ మెరుగుపడి నాలుగో ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. కెరీర్‌లో తొలి టెస్ట్ సెంచరీ చేసిన తెలుగు బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి 20 ప్లేస్‌లు ఎగబాకి 53వ ర్యాంక్‌లో నిలిచాడు.