Jasprit Bumrah: బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత

Jasprit Bumrah: బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అనే చెప్పుకోవాలి. 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో బుమ్రా నిలకడ అసాధారణం. ఎన్నో అంచనాలతో సిరీస్ ఆడిన బుమ్రా.. అంతకు ముంచి రాణించాడు. సిరీస్‌లో 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. దీంతో ఈ భారత ఫాస్ట్ బౌలర్ అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఆస్ట్రేలియాలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న బుమ్రా.. అంతకముందు ఇంగ్లాండ్, సౌతాఫ్రికా గడ్డపై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్  అవార్డు గెలుచుకున్నాడు. దీంతో మూడు ఫారెన్ కంట్రీస్ పై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న తొలి భారత క్రికెటర్ గా బుమ్రా అరుదైన రికార్డ్ సాధించాడు. 2021 ఇంగ్లాండ్ గడ్డపై.. 2024 లో సౌతాఫ్రికాపై బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్న బుమ్రా టాప్ ర్యాంక్ ను మరింత పదిలం చేసుకున్నాడు. 

బుమ్రా తర్వాత 21 వికెట్లతో కమ్మిన్స్ రెండో స్థానంలో నిలిచాడు. భారత బౌలర్లందరూ ఈ సిరీస్ లో 48 వికెట్లు తీసుకుంటే బుమ్రా ఒక్కడే 32 వికెట్లు పడగొట్టడం విశేషం. తొలి టెస్టులో 8 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. రెండో టెస్టులో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మూడో టెస్టులో 9 వికెట్లు.. నాలుగో టెస్టులో మరో 9 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చివరిదైన సిడ్నీ టెస్టులో 2 వికెట్లు లభించాయి. వెన్ను గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా బౌలింగ్ చేయడానికి రాలేదు.