BGT 2024-25: రోహిత్ ఔట్..? ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు కెప్టెన్‌గా బుమ్రా

BGT 2024-25: రోహిత్ ఔట్..? ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు కెప్టెన్‌గా బుమ్రా

నవంబర్ 22న ఆస్ట్రేలియాతో పెర్త్‌లో ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టుకు ముందు భారత్ కు బిగ్ షాక్ తగిలే అవకాశముంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరం కానున్నట్టు తెలుస్తుంది. న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ను 0-3 తేడాతో కోల్పోయిన తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాతో పెర్త్ లో జరగనున్న తొలి టెస్ట్  విషయంపై సందేహం వ్యక్తం చేశాడు. తాను ఆడతానో లేదో అని అనుమానంగా చెప్పాడు. వస్తున్న నివేదికల ప్రకారం రోహిత్ వ్యక్తిగత సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 

రోహిత్ శర్మ మరోసారి తండ్రి కాబోతున్నట్లు కథనాలు రావడంతో ఈ వార్తల్లో మరింత బలం చేకూరింది. రోహిత్ సతీమణి రితిక సజ్దే బేబీ బంప్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలు తీసి.. వాటిని నెట్టింట పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు బయటకు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే కామెంటేటర్ హర్ష భోగ్లే.. త్వరలో భారత కెప్టెన్ ఇంటికి అతిథి రాబోతున్నారని వ్యాఖ్యానించడం వైరల్ గా మారింది. ఈ కారణంగానే రోహిత్ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమైతే అతని స్థానంలో ప్రస్తుతం టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ గా ఉంటున్న బుమ్రా కెప్టెన్సీ చేయనున్నాడు. 

న్యూజిలాండ్‌పై భారత్ 3-0తో వైట్‌వాష్ అయిన తర్వాత భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాల్సిన పరిస్థితి. రోహిత్ సేన టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైనల్ పోరుకు అర్హత సాధించాలంటే, ఆస్ట్రేలియా ప‌ర్యట‌న‌ చావో రేవో లాంటిది. బోర్డర్ గ‌వాస్కర్ ట్రోఫీని 5-0 లేదా 4-0 తేడాతో సిరీస్ ద‌క్కించుకుంటే, తప్ప ముందుకెళ్లే దారుల్లేవ్. అలాకాకుండా కంగారూల జట్టు ట్రోఫీని అందుకుంటే.. మనం ఆశ‌లు వదులుకోవాల్సిందే.