కమలం ఓట్​ బ్యాంక్​కు జాట్​ జలక్​!

హర్యానాలో బీజేపీ అధికారానికి అయిదు సీట్ల దూరంలో ఆగిపోయింది. బీజేపీ రెబెల్స్​ అయిదుగురు ఎమ్మెల్యేలుగా గెలవడంతో వాళ్లు పుట్టింటికి వచ్చేస్తారన్న అంచనాతో ఉన్నారు కమలనాథులు. ఈలోగా బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ పవర్​లోకి రానివ్వకూడదని జాట్​ కులం అగ్రనేతలు పంతం పట్టి కూర్చున్నట్లు ఎనలిస్టులు చెబుతున్నారు. అవసరమైతే చౌతాలా ఫ్యామిలీకి చెందిన దుష్యంత్​ని సీఎంగా చేయాలని మాజీ సీఎం హుడా అంటున్నారు. పోయినసారి జాట్​ కులానికి చెందని పంజాబీ ఖట్టర్​ని సీఎం చేయడంతో వాళ్లంతా ఈసారి బీజేపీకి దూరమైనట్లు ఓట్ల సరళితో తెలుస్తోందని పరిశీలకులు అంటున్నారు.

హర్యానాలో నాన్​–జాట్​ సీఎంతో అయిదేళ్లు నడిపించిన బీజేపీకి ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 90 సీట్ల హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. మేజిక్​ ఫిగర్​ (46) అధికార బీజేపీకిగానీ, ప్రతిపక్ష  కాంగ్రెస్​కిగానీ రాలేదు. దీంతో ఏడాది క్రితం ఏర్పడిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)  ఆ పార్టీ చీఫ్ దుష్యంత్ సింగ్​ చౌతాలా ఎవరికి మద్దతు ఇస్తారోనన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. బీజేపీని దూరంగా నెట్టడానికి 2018 నాటి కర్ణాటక ఫార్ములాను హర్యానాలో అమలు చేయాలని కాంగ్రెస్​ అనుకుంటున్నట్లు ఆ పార్టీ సీనియర్​ లీడర్​, మాజీ సీఎం భూపీందర్​ సింగ్​ హూడా చెబుతున్నారు. బీజేపీ కూడా మేజిక్​ ఫిగర్​ తగ్గినా ప్రభుత్వ ఏర్పాటుకుగల​ అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. జేజేపీ చీఫ్​ దుష్యంత్​ సింగ్​ మద్దతు కూడగట్టుకోవడానికి భావిస్తోంది. ఒకవేళ ఈ ప్రయత్నం ఫెయిలైతే ఇండిపెండెంట్లుగా గెలిచిన ఏడుగురి సపోర్ట్​ తీసుకోవాలన్నది సెకండ్​ ఆప్షన్​గా బీజేపీ పెట్టుకుంది. వీరిలో అయిదుగురు బీజేపీ రెబెల్స్ కావడంతో వారి సాయం పొందడం కష్టం కాదని లెక్కలేసినట్లు చెబుతున్నారు. వీరితోపాటు ఐఎన్​ఎల్డీ, హర్యానా లోక్​హిత్​ పార్టీల నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలతోకూడా సంప్రదింపులు జరపాలని నిర్ణయించుకున్నట్లు పొలిటికల్​ సర్కిల్స్​లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో దుష్యంత్ సింగ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. తాను ఇంకా ఎవరితోనూ మాట్లాడలేదంటున్నారు దుష్యంత్​. హర్యానాలోనూ, కేంద్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన దేవీలాల్​కి ఆయన మునిమనవడు, మాజీ సీఎం ఓం ప్రకాశ్​ చౌతాలాకి మనవడు.

బీజేపీకి బ్రేక్​ వేసింది ఇవేనా?

రాష్ట్రంలో 25 శాతం వరకుగల జాట్ ఓటర్లు బీజేపీపై చాలా కోపంతో ఉన్నట్లు ప్రచార సమయంలోనే పరిశీలకులు అంచనా వేశారు. మొత్తం 90 సీట్లలో 29 చోట్ల జయాపజయాలను డిసైడ్ చేసే స్థాయిలో జాట్ కులస్తులున్నారు. హర్యానాలో మొదటి నుంచీ వీరిదే రాజకీయ పెత్తనం. పెద్ద సంఖ్యలో ఉన్న తమను కాదని, ఓ పంజాబీ అయిన మనోహర్ లాల్ ఖట్టర్​కి సీఎం పదవి కట్టబెట్టడం జాట్​లకు మింగుడు పడలేదని ఎనలిస్టులు అంటున్నారు. 2016లో విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కోరుతూ జాట్​లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.  అది హింసాత్మకంగా మారి 31 మంది చనిపోయారు. ఈ ఘటన జరిగి మూడేళ్లయినందువల్ల దాని ప్రభావం ఉండకపోవచ్చని బీజేపీ భావించిందని, అయితే అది తప్పని లేటెస్ట్ ఫలితాలు నిరూపించాయని పోల్​ పండిట్లు చెబుతున్నారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించడంలో ఖట్టర్ ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలుకూడా ఉన్నాయి. రైతుల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కూడా బీజేపీ ఓటమికి కారణమైందని చెబుతున్నారు.  ఇవన్నీ ఎలా ఉన్నా  ఆగస్టులో ఖట్టర్​ జరిపిన ‘జన్ ఆశీర్వాద్ యాత్ర’కు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాంగ్రెస్​లో లుకలుకలు, ఐఎన్ఎల్డీ చీలిపోవడం వంటి అంశాలన్నీ తమకు అనుకూలంగా మారతాయని బీజేపీ నాయకులు లెక్కలు వేసుకున్నారు. దీంతో గెలుపు తమదేనన్న ధీమాతో బీజేపీ లీడర్లు విమర్శలపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదని అంటున్నారు. తమకు సీఎం పోస్టు ఇవ్వనందుకు ఈ ఎన్నికల్లో జాట్​లు బీజేపీకి కాకుండా మరే పార్టీకైనా ఓటు వేయాలని ఖాప్​ పంచాయతీల్లో తీర్మానించుకున్నట్లు ఎనలిస్టులు చెబుతున్నారు. వీరిలో మెజారిటీ వర్గం దుష్యంత్​కు అండగా నిలిచిందంటున్నారు. దీని ఫలితంగానే బీజేపీ మేజిక్​ ఫిగర్​కు చేరుకోలేకపోయిందని విశ్లేషిస్తున్నారు.

ఓటమి పాలైన మంత్రులు

హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సహా మొత్తం తొమ్మిది మంది మంత్రులున్నారు. వీరిలో సీఎం ఖట్టర్, అనిల్ విజ్ మినహా మిగతా ఏడుగురు మంత్రులు ఓడిపోయారు. అంతేకాదు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సుభాష్ బరాలా కూడా ఓడిపోయారు.

గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్​

నోటిఫికేషన్ రాక ముందు కాంగ్రెస్ పరిస్థితి గందరగోళం గా ఉండేది. ముఠా కుమ్ములాటలు ఎక్కువగా ఉండేవి. పార్టీ టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. చాలా మంది చిన్నా చితకా లీడర్లు కాంగ్రెస్ కు గుడ్ బై కొట్టి బీజేపీ గూటికి చేరినా కాంగ్రెస్​ గట్టి పోటీ ఇవ్వడాన్ని పరిశీలకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

కులం లెక్క తప్పింది

హర్యానాలో జాట్​ కులస్తుల ప్రభావం ఎక్కువ. ఏ ఎలక్షన్​లోనైనా జాట్​ ఓట్లే కీలకంగా మారుతున్నాయి. అందుకే జాట్​ కులస్తుడ్నే రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం అక్కడ మామూలైపోయింది. బీజేపీ దీన్ని బ్రేక్​ చేయాలని అరోరా ఖత్రి కులానికి చెందిన మనోహర్​ లాల్​ ఖట్టర్​ను సీఎం చేసింది. ఇలా జాట్​ కులానికి చెందనివారిని ముఖ్యమంత్రి చేయడంతో జాట్లు కోపంగా ఉన్నారని, ఆ కారణంగానే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీకి దూరంగా ఉండిపోయిందని ఎనలిస్టులు అంటున్నారు.

జాట్ ఓట్లను లాగేసిన హుడా

రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన భూపీందర్ సింగ్ హుడా, జాట్ కులానికి చెందిన లీడర్. సోనియా విధేయుడిగా పాపులర్. తండ్రి రణ్​దీప్​ సింగ్​ హుడా హయాం నుంచీ ఈ కుటుంబం జాట్​ కులస్తుల్లో మంచి పట్టు సాధించింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆయనకు పోల్ మేనేజ్​మెంట్ కమిటీ చైర్మన్ పదవి అప్పగించింది. ఈసారి బీజేపీకి జాట్ కమ్యూనిటీ ఓట్లు పడకుండా హుడాను సోనియా వ్యూహాత్మకంగా  తెర మీదకు తీసుకువచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు.

కర్ణాటక ప్రయోగం చేస్తారా ?

రోహతక్, సోనేపట్, భివానీ, హిస్సార్​, జజ్జర్, మహేంద్రగఢ్, జింద్​, కైథాల్​ జిల్లాల్లో జాట్ల ప్రాబల్యం ఎక్కువ. ఈ జిల్లాల పరిధిలో మాజీ సీఎంలు భజన్​లాల్, బన్సీలాల్, దేవీలాల్, భూపీందర్​ హుడా కుటుంబాలదే ఆధిపత్యం. దేవీలాల్​ వారసత్వంతో వచ్చిన ఆయన మునిమనవడు దుష్యంత్​ సింగ్​ ఇప్పడు కింగ్​ మేకర్​ కాబోతున్నారు. ఐఎన్​ఎల్​డీని చీల్సి జననాయక్​ జనతా పార్టీ (జేజేపీ) ఏర్పాటు చేసి… తాజా ఎన్నికల్లో 10 సీట్లు గెలిచారు. దీంతో తమకు గనుక మెజారిటీ ఫిగర్​ 46 సీట్లు రాకపోతే.. కర్ణాటక  ప్రయోగాన్ని హర్యానాలోనూ చేయడానికి సిద్ధమేనని హుడా ప్రకటించేశారు. కర్ణాటకలో 225 సీట్లకుగాను కేవలం 37 ఎమ్మెల్యేలుగల జేడీ(ఎస్​)కి 66 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్​ మద్దతు పలికిన విషయం గుర్తుండే ఉంటుంది. అదే తీరుగా బీజేపీకి అధికారం దక్కకుండా దుష్యంత్​ సింగ్​ని సీఎం చేయడానికైనా రెడీ అంటున్నారు భూపీందర్​ సింగ్​ హుడా.

కొత్త కెరటం దుష్యంత్

దుష్యంత్ సింగ్ చౌతాలా, హర్యానా పాలిటిక్స్​లో కొత్త కెరటం. హర్యానా పాలిటిక్స్​ని శాసించిన జాట్ కురువృద్ధుడు దేవీలాల్ ముని మనవడు. దేవీలాల్ రెండుసార్లు ముఖ్యమంత్రిగా,  డిప్యూటీ ప్రధానిగాకూడా చక్రం తిప్పారు. 1996లో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ)ని ఏర్పాటు చేశారు. దేవీలాల్ తరువాత ఆయన పెద్ద కొడుకు  ఓం ప్రకాశ్ చౌతాలా పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆ తరువాత ఓం ప్రకాశ్ కొడుకులు అభయ్, అజయ్ మధ్య ఆధిపత్య పోరు సాగింది. దీంతో కిందటేడాది డిసెంబర్​లో ‘జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)’ అనే కొత్త పార్టీని దుష్యంత్ ఏర్పాటు చేశారు. పార్టీ పుట్టిన నెలకే జరిగిన జింద్ బై పోల్ లో జేజేపీ 37 వేలకు పైగా ఓట్లు తెచ్చుకుని సెకండ్ ప్లేస్ దక్కించుకుంది.

అంచు వరకు వెళ్లి ఆగడం ఇది మూడోసారి

కర్ణాటక, మధ్యప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే హర్యానాలోనూ బీజేపీ మేజిక్​ ఫిగర్​కి దగ్గరలోకి వచ్చింది ఆగిపోయింది. కర్ణాటకలో 9 సీట్లు, మధ్యప్రదేశ్​లో 8 సీట్లు తక్కువ కావడంతో అధికారానికి దూరమైంది. అలాగే, ఇప్పుడు హర్యానాలో అయిదు సీట్లు తక్కువ పడ్డాయి. మనోహర్​లాల్​ ఖట్టర్​ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై రైతాంగం తప్ప ఇతర వర్గాల్లో అంతగా అసంతృప్తి లేదని, అయితే ఏదో బలమైన కారణమే ఉండిఉండొచ్చని అంటున్నారు. కర్ణాటకలో యడ్యూరప్ప మొదట తెగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ బల పరీక్షలో నెగ్గడం కష్టమని రాజీనామా చేసేశారు. ఆ తర్వాత కుమార స్వామి ముఖ్యమంత్రిగా ఏర్పడ్డ జేడీ(ఎస్​), కాంగ్రెస్​ కూటమి ప్రభుత్వం ఎంతో కాలం నిలబడలేదు. కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో వారిపై స్పీకర్​ అనర్హత వేటు వేశారు.  చివరికి కూటమి ప్రభుత్వం పడిపోవడంతో మరలా యడ్యూరప్ప ముఖ్యమంత్రి కాగలిగారు. మొత్తంగా చూసుకుంటే… ఎడ్జ్​ వరకు వచ్చి బీజేపీ చతికిలపడడం ఇది మూడోసారి.

సోనియా ప్లాన్​ పనిచేసినట్టే !

పడి లేచే కెరటంలాంటిది కాంగ్రెస్​ పార్టీ అని మరోసారి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు రుజువు చేశాయంటున్నారు ఎనలిస్టులు. 2014లో గెలిచిన సీట్లతో పోలిస్తే… హర్యానాలో 17 చోట్ల, మహారాష్ట్రలో 10 చోట్ల పుంజుకుంది. మహారాష్ట్రలో అధికారానికి ఆమడ దూరంలో ఉన్నాగానీ, హర్యానాలో మాత్రం టాక్టికల్​గా రాజకీయం నడిపితే పవర్​ దక్కించుకునే అవకాశాలు లేకపోలేదన్న ఆశ పార్టీకి ఉంది.

దాదాపు ఏడాదిన్నర కాలం నాయకత్వ సమస్యతో ఇబ్బంది పడిన కాంగ్రెస్​కి ఇది మంచి బూస్ట్​ ఇస్తుందని అంటున్నారు. పార్టీ లీడర్​షిప్​ బలంగా ఉంటే క్యాడర్​ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారనడానికి కాంగ్రెస్​ని మించిన ఉదాహరణ మరొకటి ఉండదు. లోక్​సభ ఎన్నికల తర్వాత రాహుల్​ గాంధీ కాంగ్రెస్​ కాడి కింద పడేయడంతో సోనియా మళ్లీ భుజానికెత్తుకున్నారు. పార్టీ క్యారెక్టర్​ని సోనియా అర్థం చేసుకున్నట్లుగా రాహుల్​ సర్దుకోలేకపోయారని దీనినిబట్టి తెలుస్తోంది. ఆమె తాత్కాలిక ప్రెసిడెంట్ అయితే కావచ్చు, కానీ హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈమాత్రం సీట్లు వచ్చాయంటే మాత్రం ఆమె ఎక్కడికక్కడ చేసిన మార్పులు చేర్పులే కారణమని పొలిటికల్​ సర్కిల్స్​లో వినపడుతోంది.

1998 నుంచి రెండు దశాబ్దాలపాటు పార్టీ పగ్గాలు పట్టుకున్న సోనియా గాంధీ… 2017 చివరలో వారసుడు రాహుల్​ గాంధీకి ఏఐసీసీ చీఫ్​ సీటుని అప్పగించి తప్పుకోవడం తెలిసిందే. గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఈ మార్పు పార్టీకి పెద్దగా కలిసిరాలేదు. 2018లో మొదటి ఆరు నెలల్లో జరిగిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్​ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన కర్ణాటక ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోయింది. నాగాలాండ్​, కర్ణాటకల్లో అధికారం కోల్పోయింది. అదే ఏడాది చివరలో జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రం మళ్లీ పుంజుకుంది. రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​లలో పాతుకుపోయిన బీజేపీని కదిలించేసి, పవర్​లోకి వచ్చింది. మిజోరాంలో అధికారం కోల్పోగా, తెలంగాణలో లోకల్​ పార్టీ టీఆర్​ఎస్​కి తలవంచాల్సి వచ్చింది. ఇన్ని పరిణామాల మధ్య 2019లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్​ పార్టీ డీలా పడింది. తాము అధికారంలో ఉన్న రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ల్లో సైతం గెలవలేకపోయింది.

లోక్​సభ ఎన్నికలు ముగియగానే రాహుల్​ గాంధీ ఏఐసీసీ కుర్చీ వదిలేశారు. ఎన్నో రకాలుగా బతిమాలినా, పార్టీ వదిలేస్తామని బెదిరించినా రాహుల్​ వెనక్కి రాలేదు. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో సోనియా గాంధీనే బాధ్యతలు అందుకోవలసి వచ్చింది. ఆర్గనైజేషనల్​ ఎన్నికలు జరిగేవరకు తాత్కాలిక చైర్​పర్సన్​గా ఆమె పార్టీని నడిపించేలా సీనియర్లు ఒత్తిడి తెచ్చారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో రాహుల్​ టీమ్​ని పక్కనబెట్టేశారు. సోనియా సీనియర్లకు బాధ్యతలు పంచేయడం, పొత్తు కుదుర్చుకోవడం వంటివి మంచి రిజల్ట్స్​నిచ్చాయంటున్నారు.