హర్యానా అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రంలో తాడో పేడో తేల్చుకోవడానికి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఐదేళ్లు పూర్తి చేసుకున్న బీజేపీ రెండో సారి కూడా అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉంటే, కాషాయ హవాకు బ్రేక్ వేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈసారి ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉన్నప్పటికీ ఐఎన్ఎల్డీ , ఆ పార్టీ నుంచి చీలిపోయిన ‘జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ)’ కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. వీటితో పాటు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), స్వరాజ్ ఇండియా పార్టీ (ఎస్ఐపీ) కూడా బరిలో ఉన్నాయి. మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే, 1169 మంది కేండిడేట్లు బరిలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అన్ని సీట్లకు పోటీ చేస్తుంటే బీఎస్పీ 87 సీట్లకు కేండిడేట్లను నిలిపింది. ఐఎన్ఎల్డీ 81 సీట్లలో పోటీ చేస్తోంది.
పోయినసారి బొటాబొటీ మెజారిటీతో పవర్ దక్కించుకున్న బీజేపీ… ఈసారి 75 సీట్ల టార్గెట్ పెట్టుకుంది. మునుపటిలా బీజేపీకి జాట్ల నుంచి వ్యతిరేకత లేదని లోక్‌సభ ఎన్నికల్లో తేలిపోయింది. జాట్ల ఏరియాల్లో మెజారిటీ సీట్లు బీజేపీనే గెలుచుకుంది. దీంతో ఈసారి జాట్ ఓట్ బ్యాంకుపై ఫోకస్ పెట్టింది. 23 స్థానాల్లో జాట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు. వీళ్లు ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారో సోమవారం జరిగే పోలింగ్‌లో తేలనుంది.
హర్యానాకి పొరుగున ఉన్న పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో బీజేపీకి పొత్తు ఉన్నా… ఇక్కడ మాత్రం వేర్వేరుగానే బరిలో దిగాయి. ఈ మధ్య కలాన్వలి ఎమ్మెల్యే బీజేపీలో చేరడంతో అకాలీదళ్ కోపంతో ఉంది. తమకు పాతిక సీట్లు కేటాయించాలని కోరడంతో అకాలీల్ని బీజేపీ దూరం పెట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందుగానే ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గ్రౌండ్ వర్క్ చేశారు. ‘జన్ ఆశీర్వాద్ యాత్ర’ పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. మొత్తం 22 రోజుల పాటు ఆయన రాష్ట్రమంతా చుట్టేశారు. సామాన్య ప్రజల కోసం తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించారు. టికెట్లు ఇవ్వడంలోనూ ఈసారి బీజేపీ ఆచితూచి వ్యవహరించింది. ఫ్యాషన్ డిజైనర్ నౌక్షమ్ చౌధురి, కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించిన బబిత ఫోగట్, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్లాంటివాళ్లను బీజేపీ రంగంలో దింపింది.
ఈసారి ఎన్నికల ప్రత్యేకతలు
ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 10 సెగ్మెంట్లలో తొమ్మిది సెగ్మెంట్లను బీజేపీనే గెలుచుకుంది. ఈ గెలుపు జోష్ కేడర్‌లో ఇంకా ఉంది. ఈ ఎన్నికలకు మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటివి బీజేపీకి దేశవ్యాప్తంగా మంచి మైలేజీ ఇచ్చిందంటున్నారు ఎనలిస్టులు. దీంతో రాష్ట్రంలోని ముస్లిం మహిళలు తమకే జై కొడతారని బీజేపీ లీడర్లు భావిస్తున్నారు. వీటన్నిటితో పాటు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా ఖట్టర్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రాలేదు. ఖట్టర్కున్న క్లీన్ ఇమేజ్ తమకు ప్లాస్ పాయింట్ అవుతుందని బీజేపీ లీడర్లు భావిస్తున్నారు.
కాంగ్రెస్‌లో కుమ్ములాటలు
2014 వరకు హర్యానాలో చక్రం తిప్పిన కాంగ్రెస్ ఆ తరువాత తన పలుకుబడి కోల్పోయింది. ఈసారి టికెట్ల కేటాయింపుకు ముందు నుంచీ కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు మొదలయ్యాయి. మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడాకు వ్యతిరేకంగా చాలామంది గళమెత్తారు. టికెట్లు ఇవ్వడం మొదలయ్యాక ఇంకా ముదిరాయి. హర్యానా కాంగ్రెస్ అంతా ‘హుడా కాంగ్రెస్’ మారిందన్న విమర్శలు వచ్చాయి. పీసీసీ చీఫ్‌గా ఉన్న అశోక్ తన్వర్ ఎన్నికలకు ముందు పార్టీకి గుడ్ బై కొట్టారు. పార్టీని చక్కదిద్దడంలో భాగంగా మాజీ కేంద్ర మంత్రి కుమారి షెల్జాను కొత్త పీసీసీ చీఫ్‌గా హై కమాండ్ నియమించింది. హుడా జాట్ కులస్తుడు. బీజేపీకి పడే జాట్ ఓట్లకు హుడా కొంతమేరకైనా గండి కొడతారని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది.
ప్రతిపక్షాలు తలోదారి
హర్యానా ప్రతిపక్షాల్లో ఒక్కో పార్టీది ఒక్కో దారి. అధికారంలో ఉన్న బీజేపీని కట్టడి చేయడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక అలయన్స్గా కూడా ఏర్పాటు కాలేకపోయాయి.
మేనిఫెస్టోల్లో ఎవరేం చెప్పారు ?
కాంగ్రెస్: తాము అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామని, పంట బీమా ఇస్తామని, మోటార్ వెహికిల్స్ చట్టంలో మార్పులు చేస్తామని కాంగ్రెస్ ‘సంకల్ప్ పత్ర్ (మేనిఫెస్టో)’లో హామీనిచ్చింది.
బీజేపీ: ‘హర్యానా ఆఫ్ మై డ్రీమ్స్’ పేరుతో మొత్తం 15 చాప్టర్లతో 248 పాయింట్ల ప్రణాళికను రిలీజ్ చేసింది. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం కావడంతో వడ్డీ లేకుండా రైతులకు, ఎలాంటి హామీ అవసరం లేకుండా ఎస్సీలకు మూడేసి లక్షల రూపాయల వరకు రుణాలిస్తామని, వెయ్యి కోట్లతో రైతు నిధి ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఇంకా… పరిశ్రమలు పెట్టేవారు 95 శాతం లోకల్ జనాలకు ఉద్యోగాలు ఇచ్చినట్లయితే స్పెషల్ బెనిఫిట్స్, వృద్ధాప్య పించన్ని 3,000 రూపాయలకు పెంపు, ఉద్యోగులందరికీ ఓకే తీరుగా జీతభత్యాలు, లక్షా 80 వేల కంటే తక్కువ ఆదాయంగల కుటుంబాల్లో ఇద్దరు ఆడపిల్లలకు ఉచితంగా చదువు, వాళ్లకోసం ప్రత్యేకంగా పింక్ బస్సు సర్వీసు, 2,000 వరకు వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చింది.
తొలి నాన్–జాట్ సీఎం ఖట్టర్
హర్యానాకు ముఖ్యమంత్రి అయిన తొలి నాన్–జాట్ మనోహర్ లాల్ ఖట్టర్. ఆయన పంజాబీ. ఖట్టర్ తాతముత్తాతలది పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతం. దేశ విభజన తరువాత, ఖట్టర్ పూర్వీకులు హర్యానాకు వచ్చి సెటిలయ్యారు. ఆరెస్సెస్ ప్రచారక్‌గా ఆయన 14 ఏళ్ల పాటు పనిచేశారు. అప్పటి నుంచే నరేంద్ర మోడీతో మంచి పరిచయాలు న్నాయి. హర్యానాలో బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేశారు. చాలా మంది ఆరెస్సెస్ లీడర్లలాగా ఖట్టర్ కూడా బ్రహ్మచారే. ఐదేళ్లు
సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుని సెకండ్ టర్మ్ గెలవాలనుకుంటున్నారు.
లాల్ త్రయం
బన్సీలాల్, భజన్‌లాల్, దేవీలాల్.. ఈ ముగ్గురూ ‘లాల్ త్రయం’గా ఫేమస్. వీరు ముగ్గురూ హర్యానా సీఎంలుగా పనిచేశారు. బన్సీలాల్ పెద్ద కొడుకు రణ్‌బీర్ సింగ్ ఎమ్మెల్యేగా, చిన్న కొడుకు సురేందర్సింగ్ ఎంపీగా గతంలో నెగ్గారు. సురేందర్ భార్య కిరణ్ చౌదరి ఎమ్మెల్యేగా, కూతురు శ్రుతి ఎంపీగా ఉన్నారు. ఈ ఫ్యామిలీ గతంలో స్టేట్ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉండేది. ఇప్పుడు భివాని లోక్‌సభ నియోజకవర్గం, తోషామ్ అసెంబ్లీ సెగ్మెంట్‌కే పరిమితమైంది. భజన్‌లాల్ కుటుంబమూ అప్పట్లో చక్రం తిప్పేది. ప్రస్తుతం హిసార్ లోక్‌సభ సెగ్మెంట్, అదంపూర్ అసెంబ్లీ పరిధిలోనే చురుకుగా ఉంటోంది.