గిరిజన హాస్టళ్లను గురుకులాలుగా మార్చాలి : జాటోత్ హుస్సేన్ నాయక్

గిరిజన హాస్టళ్లను గురుకులాలుగా మార్చాలి : జాటోత్ హుస్సేన్ నాయక్
  • ఎస్సీ, ఎస్టీలు అడిగిన చోట  ఎంట్రెన్స్​తో పని లేకుండా సీట్లివ్వాలి
  • గిరిజనులు పెట్టిన కేసులపై  వెంటనే స్పందించాలి

ఖమ్మం టౌన్, వెలుగు: గిరిజన హాస్టళ్లను గురుకులాలుగా మార్చి సౌకర్యాలు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అడిగిన చోట్ల ప్రవేశ పరీక్షలతో సంబంధం లేకుండా సీట్లు కేటాయించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ కోరారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్​లోని మీటింగ్ హాల్​లో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి గిరిజనుల కోసం అమలవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్​ఓవర్సీస్ విద్యా పథకం అమలుపై పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు.

 ట్రైకార్ పథక లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలన్నారు. పోడు పట్టాల విషయంలో చర్యలు తీసుకోవాలని, కొన్నిచోట్ల పోడు సాగు చేస్తున్నా పట్టాలివ్వలేదన్నారు. వారికి న్యాయం చేయాలన్నారు. గిరిజనుల కేసులపై వెంటనే స్పందించాలన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎన్ని నిధులు మంజూరైంది? ఖర్చు, మిగులుపై పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు.  తండాలు..గ్రామ పంచాయతీలుగా మారిన చోట, భవనాలు నిర్మించాలని, ఉపాధిహామీ సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వివిధ శాఖల ద్వారా గిరిజన సంక్షేమానికి చేపట్టిన పనులు, వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.  

జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ​సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అడిషనల్​కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, అడిషనల్​ డీసీపీ నరేశ్ కుమార్, డీఆర్​వో ఎం.రాజేశ్వరి, జిల్లా ట్రైబల్ ​వెల్ఫేర్​ఆఫీసర్​విజయలక్ష్మి పాల్గొన్నారు. అంతకుముందు ఖమ్మంలో విలేకరులతో హుస్సేన్​ నాయక్​ విలేకరులతో మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలకు గిరిజనులు ఢిల్లీ వరకు వచ్చే పని లేకుండా...ఎన్సీఎస్టీఈగ్రామ్ వెబ్ సైట్ ద్వారా అన్​లైన్​లో  ఫిర్యాదు చేయవచ్చన్నారు. దీనివల్ల వారం రోజుల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ట్రైబల్ వెల్ఫేర్​, ఆశ్రమ, గురుకులాల్లో రోస్టర్ పాయింట్ల విషయంలో గిరిజన బిడ్డలు పక్షపాతానికి గురవుతున్నారన్నారు.