హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టోను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం మాటువేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ఏజెన్సీల సమన్వయంతో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ బృందం మట్టోను అరెస్టు చేసింది. మట్టో నుండి ఒక పిస్టల్, ఆరు లైవ్ కాట్రిడ్జ్‌లు, దొంగిలించబడిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడంలో మట్టో కీలక పాత్ర పోషించాడు. సోపోర్ నివాసి అయిన మట్టో చాలాసార్లు పాకిస్తాన్‌కు వెళ్లాడు. భద్రతా సంస్థల దగ్గరున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో జావేద్ ఒకడు. ఇతడిపై కేంద్రం రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.
కాగా గత సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు సోపోర్‌లోని తన ఇంటిలో మట్టో సోదరుడు రయీస్ మట్టో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నట్లు చూపిస్తూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది .