జవహర్​నగర్​ డంపింగ్​యార్డ్​తో డేంజర్​ బెల్స్ .. భూగర్భ జలాలు కలుషితం

జవహర్​నగర్​ డంపింగ్​యార్డ్​తో డేంజర్​ బెల్స్ .. భూగర్భ జలాలు కలుషితం
  • 10 కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు కలుషితం
  • 200 ఉండాల్సిన టీడీఎస్ వాల్యూ 4 వేలు దాటుతున్నట్లు గుర్తింపు
  • నీళ్లను తాగుతున్న వారికి చర్మ సమస్యలు  
  • కొందరిలో మౌత్ ఇన్ఫెక్షన్లు,కిడ్నీ వ్యాధులు  
  • వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ తో వస్తున్న పొగతో ఊపిరి పీల్చుకోలేకపోతున్నట్లు గుర్తింపు
  • ‘క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్’ స్టడీ రిపోర్ట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ శివారులోని జవహర్ నగర్ డంపింగ్ యార్డుతో జనం నాన అవస్థులు పడుతున్నారని ‘క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్’ స్టడీలో తేలింది. గత నెల 23న ఆ సంస్థ ప్రతినిధులు డంపింగ్ యార్డుని సందర్శించారు. ఆ చుట్టు పక్కల ప్రాంతాలపైనా స్టడీ చేశారు. యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ జవహర్‌‌‌‌‌‌‌‌నగర్, నవోదయ వెల్ఫేర్ సొసైటీ,  సీఎన్‌‌‌‌‌‌‌‌ఆర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, బహుజన సత్తా, దళిత బహుజన ఫ్రంట్, అణగారిన వర్గాల పట్ల ఆర్థిక, పర్యావరణ అన్యాయానికి వ్యతిరేక వేదిక, ఇతర సామాజిక, పర్యావరణ కార్యకర్తలతో కలిసి వివరాలు సేకరించారు. గురువారం స్టడీ రిపోర్డును మీడియాడు రిలీజ్ చేశారు.

 డంపింగ్ యార్డు చుట్టూ భయంకమైన పరిస్థితులు ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. 10 కిలోమీటర్ల పరిధిలో గ్రౌండ్ వాటర్ పూర్తిగా కలుషితమైనట్లు, ఆ నీటిని తాగుతున్న జనం అనారోగ్యాల పాలవుతున్నట్లు తెలిపారు. గ్రౌండ్ వాటర్ సేకరించి ల్యాబ్ లలో టెస్ట్​చేయించగా, టీడీఎస్ లెవల్స్ పదింతలు పెరిగినట్లు తేలిందన్నారు. సాధారణ నీటిలో 200 టీడీఎస్ లెవల్స్ ఉంటే, డంపింగ్ యార్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో 4 వేల టీడీఎస్ మార్క్ దాటుతున్నట్లు గుర్తించినట్లు స్పష్టం చేశారు. దీంతో జనానికి మౌత్ ఇన్ ఫెక్షన్లు సోకుతున్నట్లు, చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు తెలిపారు. కొందరిలో కిడ్నీ సమస్యలు గుర్తించామని చెప్పారు. 

పలువురి కిడ్నీలు ఇప్పటికే ఫెయిల్​అయ్యాయన్నారు. వేస్ట్ టూ ఎనర్జీ తయారుచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ దానితో విపరీతమైన వాయు కాలుష్యం ఏర్పడుతోందన్నారు. తగలబెడుతున్న చెత్త నుంచి వచ్చే పొగ కొన్ని ప్రాంతాలను చుట్టుముడుతోందని, జనం ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. లీటర్​నీళ్లలో 75 మిల్లీగ్రాములు క్యాల్షియం ఉండాలైతే డంపింగ్​యార్డు చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రౌండ్​వాటర్​లో 896 మిల్లీగ్రాములు ఉన్నట్లు తేలింది. 250 మిల్లీ గ్రాముల కంటే తక్కువ ఉండాల్సిన ఫ్లోరైడ్​వాల్యూ 4,260 ఎంజీ/ఎల్ గా ఉంది. అస్సలు ఉండకూడని సోడియం 1,650 ఎంజీ/ఎల్ గా, పొటాషియం 195 ఎంజీ/ఎల్ గా ఉన్నట్లు తేలింది. స్టడీ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లువెల్లడించారు. 

లీచెట్​తో చెరువులు కలుషితం

డంపింగ్ యార్డులో రూ.251 కోట్లతో 2023 ఏప్రిల్15న 2వేల కేఎల్ డీ సామర్థ్యం గల లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీని నుంచి వచ్చే లీచెట్ తో సమీపంలోని చెరువులు పూర్తిగా కలుషితం అయినట్లు స్టడీలో తేలింది. మల్కారం చెరువు పూర్తిగా కలుషితమైంది. గాలి వీచినప్పుడు ఈ చెరువు నుంచి భరించలేని కంపు వస్తోందని, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. రోజురోజుకు సమస్య తీవ్రమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దమ్మాయిగూడ, నాగారం ప్రాంతాల్లోని సీఎన్ఆర్ కాలనీ, అంజనాద్రి కాలనీ, అంజనాద్రి ఎక్స్ టెన్షన్, ఎంఎల్ ఆర్ కాలనీ, సాయి శ్రీనివాస కాలనీల్లో డంపింగ్ యార్డు నుంచి వచ్చే లీచెట్​తో తాగునీరు కలుషితమవుతోందని చెబుతున్నారు.