హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలోని నిజాంపేట, పేట్ బషీర్బాగ్ ఏరియాల్లో తమకు కేటాయించిన 70 ఎకరాల స్థలాన్ని ఇప్పించాలంటూ ‘జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌజింగ్ సొసైటీ’ (జేఎన్ జేహెచ్) జర్నలిస్టులు గురువారం బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. 17ఏండ్ల కింద 1,100 మంది జర్నలిస్టులమంతా కలిసి సొసైటీగా ఏర్పడితే అప్పటి ప్రభుత్వం నిజాంపేట, పేట్ బషీరాబాద్ లో 70 ఎకరాల స్థలం కేటాయించిందని తెలిపారు. ఒక్కో జర్నలిస్ట్ అప్పు చేసి రూ.2లక్షల చొప్పున ప్రభుత్వానికి చెల్లించారని గుర్తు చేశారు.
స్థలాన్ని జర్నలిస్టులకు ఇచ్చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ఏండ్లుగా జర్నలిస్టులుగా పని చేస్తున్నా సొంతిల్లు లేక కిరాయి కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్థలాలు ఇప్పించాలని కోరారు. జర్నలిస్టులకు అండగా ఉంటానని, అవసరమైన సహకారం అందిస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చినట్లు సొసైటీ సభ్యులు అశోక్ రెడ్డి, బోడపాటి శ్రీనివాసరావు, లక్ష్మణ్ తదితరులు తెలిపారు.