టీమిండియా 2024 టీ20 ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకుని జులై 4న గురువారం విక్టరీ పరేడ్ నిర్వహించనున్నారు. బీసీసీఐ ఆధ్వర్యంలో జరగనున్న ఈ విజయోత్సవ ర్యాలీ ముంబైలోని మెరైన్ డ్రైవ్ నుండి ప్రారంభమై వాంఖడే స్టేడియం వరకూ సాగనుంది. గురువారం సాయంత్రం 5:00 గంటలకు ఈ విక్టరీ పరేడ్ ప్రారంభం కానుంది. ఈ ర్యాలీలో భారత క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని బీసీసీఐ సెక్రటరీ జై షా పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తిని పంచుకున్నారు.
"టీమిండియా టీ20 ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించే విక్టరీ పరేడ్‌లో మాతో చేరండి! మాతో జరుపుకోవడానికి జూలై 4న సాయంత్రం 5:00 గంటలకు మెరైన్ డ్రైవ్ నుండి వాంఖడే స్టేడియం వరకూ పయనించండి! తేది గుర్తుంచుకోండి!.." అని జై షా ట్వీట్ చేశారు.
🏆🇮🇳 Join us for the Victory Parade honouring Team India's World Cup win! Head to Marine Drive and Wankhede Stadium on July 4th from 5:00 pm onwards to celebrate with us! Save the date! #TeamIndia #Champions @BCCI @IPL pic.twitter.com/pxJoI8mRST
— Jay Shah (@JayShah) July 3, 2024
మోడీతో సమావేశం
కాగా, బెరిల్ హరికేన్ ప్రభావంతో బార్బడోస్‌లో చిక్కుకుపోయిన భారత క్రికెట్ బృందం కొన్ని గంటల క్రితమే స్వదేశానికి బయల్దేరింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన స్పెషల్ ఫ్లైట్‌లో వీరు భారత్‌కు పయనమయ్యారు. ఈ విమానం గురువారం(జులై 4) ఉదయం 6 గంటలకల్లా ఢిల్లీ చేరుకోనుంది. వీరు రాజధాని నగరంలో అడుగుటపెట్టాక ప్రధానితో సమావేశం కానున్నారు. అనంతరం ముంబై చేరుకొని విక్టరీ పరేడ్‌లో పాల్గొననున్నారు.