ZIM v IND 2024: జింబాబ్వే టూర్‌కు లక్ష్మణ్.. కొత్త కోచ్‌ను ప్రకటించేది అప్పుడే: జైషా

ZIM v IND 2024: జింబాబ్వే టూర్‌కు లక్ష్మణ్.. కొత్త కోచ్‌ను ప్రకటించేది అప్పుడే: జైషా

భారత ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగిసింది. వెస్టిండీస్ గడ్డపై 2024 వరల్డ్ కప్ గెలవడంతో సంతోషంతో ఈ పదవి నుంచి తప్పుకున్నాడు. అయితే ద్రావిడ్ తర్వాత టీమిండియా కోచ్ ఎవరనే విషయంలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం టీమిండియా కోచ్ గా ఇంకా ఎవరినీ అధికారికంగా ప్రకటించలేదు. టీమిండియాకు కొత్త ప్రధాన కోచ్ ఎవరనే విషయం జులై నెలాఖరులో ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి జే షా ధృవీకరించారు. 

క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించి.. ప్రధాన కోచ్ పోస్టుకు ఇద్దరి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసిందని బీసీసీఐ చీఫ్ తెలిపాడు. శనివారం (జూన్ 29) భారత్ టీ20 వరల్డ్ కప్ విజయం సాధించిన తర్వాత జైషా ప్రస్తుతం కరేబియన్‌లోనే ఉన్నారు. ఒక ఇంటరాక్షన్‌లో షా మాట్లాడుతూ.. "త్వరలో కోచ్, సెలెక్టర్ నియామకం జరుగుతుంది. లక్ష్మణ్ జింబాబ్వే టూర్ కు కోచ్ గా వెళ్తాడు. ముంబై చేరుకున్న తర్వాత కొత్త కోచ్ ఎవరనే విషయాన్ని వెల్లడిస్తాం". అని జైషా అన్నారు.
  
రాహుల్ ద్రవిడ్ స్థానంలో భారత జట్టు ప్రధాన కోచ్ రేస్ లో గౌతమ్ గంభీర్ తో పాటు మాజీ భారత మహిళల జట్టు కోచ్ WV రామన్‌లను క్రికెట్ అడ్వైజరీ కమిటీ షార్ట్‌లిస్ట్ చేసిందని నివేదికలు సూచిస్తున్నాయి. అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గంభీర్ కే ప్రధాన కోచ్ పదవి బాధ్యతలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తుంది. టీ20 వరల్డ్ కప్ ముగియడంతో భారత క్రికెట్ జట్టు జింబాబ్వేలో అడుగుపెట్టనుంది. ఈ టూర్ లో భాగంగా భారత్ మొత్తం 5 టీ20 మ్యాచ్ లు ఆడుతుంది.

ఈ టూర్ కు స్టార్ ఆటగాళ్లు  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్‌లకు రెస్ట్ ఇచ్చారు. ఐపీఎల్ లో సత్తా చాటిన యువ ప్లేయర్లకు అవకాశమిచ్చారు. గిల్ ఈ జట్టుకు కెప్టెన్సీ చేస్తాడు. మొత్తం ఐదు టీ20లు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జూలై 6,7,10,13,14 తేదీల్లో జరుగుతాయి. ఈ సిరీస్ కు లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్ తర్వాత జులై చివరి వారంలో భారత్ శ్రీలంకలో పర్యటించనుంది.