ఐసీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా జై షా

ఐసీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా జై షా
  • ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్య దేశాల బోర్డు మెంబర్స్‌‌‌‌‌‌‌‌
  • ఈ పదవి చేపట్టనున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డు

దుబాయ్‌‌‌‌‌‌‌‌ : ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ (ఐసీసీ) కొత్త చైర్మన్‌‌‌‌‌‌‌‌గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐ సెక్రటరీగా పని చేస్తున్న ఆయన డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 1న కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత చైర్మన్‌‌‌‌‌‌‌‌ గ్రెగ్‌‌‌‌‌‌‌‌ బార్‌‌‌‌‌‌‌‌క్లే మూడోసారి పదవిలో కొనసాగేందుకు విముఖత వ్యక్తం చేయడంతో 35 ఏళ్ల షాను సభ్య దేశాల బోర్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఇండియా తరఫున ఈ అత్యున్నత పదవికి ఎంపికైన ఐదో వ్యక్తిగా జై షా రికార్డులకెక్కారు. జగ్‌‌‌‌‌‌‌‌మోహన్‌‌‌‌‌‌‌‌ దాల్మియా, శరద్‌‌‌‌‌‌‌‌ పవార్‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌. శ్రీనివాసన్‌‌‌‌‌‌‌‌, శశాంక్‌‌‌‌‌‌‌‌ మనోహర్‌‌‌‌‌‌‌‌ ముందున్నారు. 

అలాగే ఐసీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పదవిని చేపట్టనున్న అతిపిన్న వయస్కుడిగా (35 ఏళ్లు) రికార్డు సృష్టించారు. వచ్చే నెల చివర్లో లేదా అక్టోబర్‌‌‌‌‌‌‌‌ తొలి వారంలో జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో సెక్రటరీ పదవికి జై షా రాజీనామా సమర్పించనున్నారు. 2028 లాస్‌‌‌‌‌‌‌‌ ఏంజెల్స్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో క్రికెట్‌‌‌‌‌‌‌‌ను చేర్చడంతో దానికి మరింత ప్రజాదరణ పెంపొందించే దిశగా పని చేయాల్సి ఉంటుంది. ఐసీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా ఎన్నిక కావడం పట్ల సంతోషంగా ఉందని జై షా అన్నారు. ‘క్రికెట్‌‌‌‌‌‌‌‌ను మరింత విస్తరించడానికి ఐసీసీ టీమ్‌‌‌‌‌‌‌‌తో కలిసి పని చేసేందుకు ప్రయత్నిస్తా. 

ఆటకు మునుపెన్నడూ లేనంత ప్రజాదరణ తీసుకురావడమే నా ముందున్న కర్తవ్యం. చాలా ఈవెంట్లకు ప్రపంచ స్థాయి మార్కెట్‌‌‌‌‌‌‌‌ను తీసుకురావాల్సి ఉంది’ అని షా పేర్కొన్నారు. గ్లోబల్‌‌‌‌‌‌‌‌ బాడీ ఆదాయంలో 75 శాతం కేవలం బీసీసీఐ నుంచే వెళ్తుంది. దీంతో ఐసీసీలో అత్యంత శక్తివంతమైన  సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌, ఆస్ట్రేలియ నుంచి కనీసం పోటీ కూడా పెట్టలేదు. ఐసీసీ రాజ్యాంగం ప్రకారం మొత్తం 17 ఓట్లు ఉండగా, ఇందులో టెస్ట్‌‌‌‌‌‌‌‌లు ఆడే దేశాల నుంచి 12, చైర్మన్‌‌‌‌‌‌‌‌, డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌, ఇద్దరు అసోసియేట్‌‌‌‌‌‌‌‌ దేశాల నామినీలు, ఒక స్వతంత్ర మహిళా డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ఓటు ఉంటుంది. 

2022లోనే ఐసీసీ సబ్‌‌‌‌‌‌‌‌ కమిటీ అయిన ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ కమర్షియల్‌‌‌‌‌‌‌‌ అఫైర్స్‌‌‌‌‌‌‌‌కు హెడ్‌‌‌‌‌‌‌‌గా నియమించినప్పుడే షాకు చైర్మన్‌‌‌‌‌‌‌‌ అయ్యే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉందని భావించారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జై షా రెండుసార్లు ఐసీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా ఉండే అర్హత ఉంది. ఆ తర్వాత మళ్లీ బీసీసీఐలోకి వచ్చే చాన్స్‌‌‌‌‌‌‌‌ కూడా లేకపోలేదు. కొత్తగా బాధ్యతలు చేపట్టే జై షా ముందున్న అతిపెద్ద సవాలు పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లో చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీని నిర్వహించడం. 2023 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ను హైబ్రిడ్‌‌‌‌‌‌‌‌ మోడల్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించేందుకు మద్దతిచ్చిన షా.. ఇప్పుడు చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీని కూడా అదేవిధంగా ముందుకు తీసుకెళ్తారా చూడాలి.