షెడ్యూల్ ప్రకారం ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2024 బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉంది. అయితే ఆ దేశంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు కారణంగా టీ20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్ లో జరగడం అనుమానంగా మారింది. దీంతో భారత్ లేదా శ్రీలంకకు ఈ టోర్నీని తరలించనున్నట్లు సమాచారం. అయితే, అక్టోబర్‌లో శ్రీలంకలో వర్షం ముప్పు ఎక్కువ. ఈ నేపథ్యంలో భారత్ వైపే ఐసీసీ మొగ్గు చూపొచ్చని నివేదికలు చెప్పుకొచ్చాయి. తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా భారత్ లో మహిళా టీ20 ప్రపంచ కప్ నిర్వహించేదే లేదని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ వివాదం కారణంగా వేదిక మారితే.. ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ 2024కి భారత్ ఆతిథ్యం ఇవ్వబోదని జైషా వెల్లడించారు. ఐసీసీ ప్రపంచ కప్ ను నిర్వహించాలా వద్దా అనే విషయంపై బీసీసీఐని సంప్రదించిందని ఆయన చెప్పుకొచ్చారు. " మీరు ప్రపంచ కప్ ను నిర్వహిస్తారా అని అని బీసీసీఐని ఐసీసీ అడిగింది. దానికి నేను నో చెప్పాను. ప్రస్తుతం భారత్ లో వర్షాకాలం. 2025 వన్డే ప్రపంచ కప్ ను మేమే నిర్వహించాలి. వరుసగా రెండు ప్రపంచ కప్ లు నిర్వహించే పరిస్థితిలో మేము లేము". అని ముంబై కార్యాలయంలో టైమ్స్ గ్రూప్ జర్నలిస్టులతో జరిగిన ఇంటరాక్షన్ సందర్భంగా షా చెప్పారు.
10 జట్లు.. 18 రోజులు
పది జట్లు తలపడే ఈ టోర్నీ అక్టోబర్ 3-20 వరకు జరగాల్సి ఉంది. పాల్గొనే 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, క్వాలిఫయర్ 1 ఉండగా.. ఆతిథ్య బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, క్వాలిఫయర్ 2 గ్రూప్-బి లో ఉన్నాయి. రెండు గ్రూపుల నుంచి టాప్-2 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 20న ఫైనల్ జరగనుంది.