Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీకి ఎంపిక కాని విరాట్, రోహిత్.. కారణం ఏంటో చెప్పిన జైషా

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీకి ఎంపిక కాని విరాట్, రోహిత్.. కారణం ఏంటో చెప్పిన జైషా

దులీప్ ట్రోఫీకి జట్లను ప్రకటించారు. అయితే ఈ  జట్టులో స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు రెస్ట్ ఇచ్చారు. ఇటీవలే శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లకు 40 రోజుల పాటు రెస్ట్ లభించనుంది. ఈ గ్యాప్ లో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దులీప్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యారనే నివేదికలు వచ్చాయి. రానున్న 5 నెలల్లో 10 టెస్టులు ఆడుతుండడంతో కోహ్లీ, రోహిత్ ఆడతారని భావించినా నిరాశ తప్పలేదు. తాజాగా బీసీ సెక్రటరీ కోహ్లీ, రోహిత్ లను ఎందుకు ఎంపిక చేయలేదో బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. 

టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన జైషా ఇలా అన్నారు. "పనిభారాన్ని తగ్గించడం కోసం రోహిత్, కోహ్లిలకు రెస్ట్ ఇచ్చాము. రానున్న టెస్ట్ సిరీస్ లో వారు తాజాగా ఉండాలి. వారికి ఎలాంటి గాయం కాకుండా చూసుకోవాలి. దేశవాళీ క్రికెట్ ఆడమని వారిని బీసీసీఐ ఒత్తిడి చేయదలుచుకోలేదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు తమ అగ్రశ్రేణి ఆటగాళ్లను దేశవాళీ క్రికెట్‌లో ఆడమని బలవంతం చేయవు. రోహిత్, కోహ్లీలను గౌరవించాల్సిన అవసరం ఉంది. అని షా అన్నారు.

దేశంలో జరిగే ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ కోసం బీసీసీఐ బుధవారం (ఆగస్ట్ 14) జట్లను ప్రకటించింది. రాబోయే ఎడిషన్ కోసం నాలుగు స్క్వాడ్ లను ఎంపిక చేసింది. టీమ్ ఏ,టీం బి, టీమ్ సి, టీం డి జట్లకు వరుసగా శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్,  శ్రేయాస్ అయ్యర్  కెప్టెన్లుగా జట్టును నడిపిస్తారు. టోర్నీ తొలి రౌండ్ సెప్టెంబర్ 5న ప్రారంభం కానుంది. రానున్న నాలుగు నెలల వ్యవధిలో భారత్‌లో బంగ్లాదేశ్ తో రెండు టెస్టులు.. న్యూజిలాండ్ తో మూడు టెస్టులు.. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. సెప్టెంబర్ 19 నుంచి స్వదేశంలో భారత్.. బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది.