- ‘టీఎస్’ ఇకపై ‘టీజీ’.. ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్
- రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల లోపు
- ఫ్రీ కరెంట్ స్కీమ్‌లకు, బీసీ కులగణనకు గ్రీన్‌సిగ్నల్
- ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు
- 10న బడ్జెట్.. త్వరలోనే మెగా డీఎస్సీ
- వివరాలు వెల్లడించిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ గీతాన్ని ‘తెలంగాణ రాష్ట్ర గీతం’గా రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. వాహనాల రిజిస్ట్రేషన్లు, ఇతరత్రా వంటి వాటికి సంబంధించి ‘టీఎస్’ను ‘టీజీ’గా మారుస్తూ ఆమోద ముద్ర వేసింది. ఆరు గ్యారంటీల్లోని రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్ స్కీమ్‌లకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 8నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. 10న ఉభయసభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్ స్కీమ్‌ల అమలు ఎప్పటి నుంచి అనేదానిపై అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ ప్రకటన చేయనున్నారు. 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. ఖైదీల క్షమాభిక్షతో పాటు హైకోర్టుకు వంద ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కులగుణనకు కూడా రాష్ట్ర కేబినెట్‌ఆమోద ముద్ర వేసింది. సెక్రటేరియెట్‌లో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ భేటీలో అనేక విషయాలపై చర్చించారు. పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
అనంతరం వివరాలను మీడియాకు మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఏ ప్రజలైతే ఇందిరమ్మ రాజ్యం కావాలని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారో వారి నమ్మకాన్ని వమ్ము చేయబోమని పొంగులేటి అన్నారు. ‘‘ఏ ప్రతిపక్ష లీడర్లు కాంగ్రెస్ పార్టీ మీద, ఇందిరమ్మ రాజ్యం మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నరో వారి నోటికి ప్లాస్టర్ వేసే విధంగా తెలంగాణ ప్రజలకు మరో రెండు గ్యారంటీలు అందిస్తం. బీసీ కులగణన చేస్తామని చెప్పినట్లుగానే ఇప్పుడు దానిని కూడా కేబినెట్ ఆమోదించింది” అని ఆయన తెలిపారు.
‘టీజీ’ కోసం చట్టం
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ‘టీజీ’ అని రిజిస్ట్రేషన్లలో అప్రూవల్ఇస్తే.. దాన్ని గత ప్రభుత్వం ‘టీఎస్’గా మార్పు చేసిందని, ఇప్పుడు దాన్ని ‘టీజీ’గా ఉంచేలా కేబినెట్ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి తెలిపారు. త్వరలోనే దీనిపై డ్రాప్ట్ బిల్లును చట్టంగా తీసుకువస్తామన్నారు. తెలంగాణ అధికార చిహ్నాన్ని మార్చాలని కేబినెట్లో తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. రాచరిక పాలన గుర్తు లేకుండా.. మన ప్రాంతం, మన ప్రజలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నం తయారు చేయాలని తీర్మానం చేశామన్నారు. ‘‘తెలంగాణ అధికార చిహ్నం.. దొరలకు చిహ్నంగా ఉండొద్దని, దొర పాలన ఎక్కడ కనిపించొద్దని, తెలంగాణ రాష్ట్రానికి అద్దం పట్టేలా ఉండాలని కేబినెట్ నిర్ణయించింది” అని చెప్పారు. కవులు, కళాకారులు, మేధావుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలకు గౌరవం దక్కుతుందో అది కాకుండా గత 10 ఏండ్లలో రాచరిక నడవడికనే కనిపించిందని ఆయన అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించిందని వెల్లడించారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం చెప్పిందన్నారు. యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అనేక కోర్సులను ఐటీఐల్లో నిర్వహిస్తామని, 65 ప్రభుత్వ ఐటీఐల అప్‌గ్రేడ్ అందుకోసమేనని చెప్పారు. హైకోర్టుకు వంద ఎకరాల భూమిని కేటాయించడంపై తమ దృష్టికి యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వచ్చిందన్నారు. వాళ్ల సమస్య కూడా పరిష్కరిస్తామని తెలిపారు.
8 నుంచి అసెంబ్లీ
ఈ నెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఆ రోజు ఉదయం 11.30 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని, అదే రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుందని చెప్పారు. 10న బడ్జెట్ ప్రవేశపెడ్తామని తెలిపారు. బీఏసీలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్నిరోజులు అసెంబ్లీ అనేది చెప్తామన్నారు. ఖైదీల క్షమాభిక్ష అమలు చేయాల్సిన దానిపై న్యాయపరమైన చర్యలకు కేబినెట్ ఆదేశించిందని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం మోటర్ వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం గెజిట్ మేరకు వాహనాలన్నింటికీ టీజీ నెంబర్ ప్లేట్‌తోనే రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. రూల్ లేకుండా.. రెగ్యులేషన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా గత రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. ‘‘టీజీ అని గెజిట్ ఇస్తే.. టీఎస్ పెట్టారు. వాళ్ల పార్టీకి సంబంధించిన చిహ్నం కనబడాలనే ఉద్దేశం అందులో ఉంది” అని అన్నారు. ప్రజాస్వామికమైన తమ ప్రజా పాలనలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఆరు గ్యారంటీలకు సంబంధించి ఎవరికి సందేహం.. సంశయం అవసరం లేదని అన్నారు. ప్రతిపక్షాలు ఇబ్బంది పడొద్దని, వాళ్లు రాష్ట్ర ఖజానా ఖాళీ చేసినా.. తాము ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
మెగా డీఎస్సీ కోసం వివరాల సేకరణ
వ్యవసాయ శాఖలో ఏఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నచోట భర్తీ చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. గ్రూప్ 1, 2, 4 వంటి వాటిపై పూర్తిస్థాయిలో కసరత్తు కాలేదని, అయినవెంటనే కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మెగా డీఎస్సీ కోసం వివరాలు సేకరిస్తున్నామని, ఎన్ని టీచర్ పోస్టుల భర్తీ అనేదానిపైనా క్లారిటీ వస్తుందని తెలిపారు. బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఇవ్వాలనే దానిపై ఆలోచన చేస్తున్నామని, ఉద్యోగుల ప్రమోషన్లపైనా తగిన నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుంటామన్నారు. ధరణిపై ధరణి కమిటీ ఇచ్చే నివేదికను అసెంబ్లీలో చర్చిస్తామని ఆయన చెప్పారు.