
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవకతవకలపై ఎన్నో ఉద్యమాలు జరిగాయి. వాటి పర్యవసానంగా పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆఫీసర్స్ కమిటీగా పేరుగాంచిన జయభారత్ రెడ్డి కమిటీ కీలక మైంది. ఈ కమిటీ ఏడాదిలోపే నివేదిక సమర్పించింది. ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ ప్రాంతవాసులకు జరిగిన అన్యాయాలను బహిర్గతం చేసింది. అక్రమం గా 58,962 మంది స్థానికేతరులు ఉద్యోగాల్లో నియామకమైనట్లు నివేదిక తేల్చింది.
తెలంగాణలోని ఉద్యోగ సంఘాలు 1983-84 మధ్య కాలంలో స్థానికేతరుల నియామకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాయి. దీనికి స్పందించిన ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 32వ రాజ్యాంగ సవరణ, రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా వచ్చిన జోన్ల రిజర్వేషన్ నియమ నిబంధనలు సక్రమంగా అమలు జరుగుతున్నాయో లేదో పరిశీలించడానికి సీనియర్ ఐఏఎస్ అధికారులైన జయభారత్‌రెడ్డి, అమర్నాథ్, ఉమాపతి సభ్యులుగా ఆఫీసర్స్ కమిటీని నియమించారు.ఈ కమిటీకి జయభారత్‌రెడ్డి కన్వీనర్‌గా వ్యవహరించారు.
నివేదిక
జయభారత్‌రెడ్డి కమిటీ 1975 నుంచి జరిగిన ఉద్యోగ నియామకాలన్నింటిని పరిశీలించి 36 పేజీల నివేదికను సమర్పించారు. ఆనాటికే తెలంగాణలో అక్రమంగా 58,962 మంది స్థానికేతరులు ఉద్యోగాల్లో నియామకమయ్యారని నివేదిక ఇచ్చింది. త్రిసభ్య కమిటీ సమర్పించిన 36 పేజీల నివేదికలోని సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 610 జీవోను జారీ చేసింది. 1975 అక్టోబర్ 18 నుంచి 1981 జూన్ 30 వరకు జరిగిన నియామకాల్లో స్థానికులకు జరిగిన అన్యాయం గురించి ఈ కమిటీ వివరించింది. జయభారత్‌రెడ్డి కమిటీ కేవలం ఏడాదిలోపే తన నివేదికను సమర్పించింది. వాస్తవంగా ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ వాటా 42శాతం, సీమాంధ్ర వాటా 58శాతం ఉంది. కమిటీ సిఫారసులను అమలు చేయకుండా నాటి ప్రభుత్వంలోని పెద్దలు అడ్డుకున్నారు. - జోన్ ఐదు పరిధిలో ఖమ్మం(10,353), వరంగల్ (3,141), ఆదిలాబాద్(5,099), కరీంనగర్(4,638), స్థానికేతర ఉద్యోగులు ఉన్నారు. జోన్ ఆరు పరిధిలో గల నల్లగొండ(3,707), మహబూబ్‌నగర్(1,489), నిజామాబాద్(4,286), మెదక్ (1,424), రంగారెడ్డి(2,103), హైదరాబాద్(22,722)ల్లో స్థానికేతర ఉద్యోగులు ఉన్నారు.
610 జీవో ముఖ్యాంశాలు
ఆరు సూత్రాల పథకం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ – 1975 జోన్ 5, 6లో ఆరుసూత్రాల పథకం అమలులో జరిగే ఉల్లంఘనలు సవరించడం కోసం 610 జీవో విడుదలైంది. జోన్ – 5, 6ల్లో ఆరు సూత్రాల పథకాన్ని ఉల్లంఘించి 1975, అక్టోబర్ 18 తర్వాత కేటాయించబడిన ఉద్యోగులను వారి సొంత జోన్లకు 1986 మార్చి 31 నాటికి పంపాలి. ఈ విషయమై అవసరమైతే సూపర్ న్యూమరీ ఖాళీల ఏర్పాటు, సమాన పద్ధతులు అవలంబించవచ్చు. జోనల్ పరిధిలోకి వచ్చిన జూరాల, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్–2లో పనిచేయుచున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్(పూర్వం జేఈలు) ఎవరైతే బయటి జోన్ల నుంచి 5, 6 జోన్లలో 1983, మార్చి 1 తర్వాత నియమించబడ్డారో అలాంటి వారిని వారి సొంత జోన్లకు తిప్పి పంపించాలి. ఇలాంటి విషయమై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెలువడించిన జీఎస్ఆర్(ఇ) తేదీ 28–05–1985 ప్రకటనను సవరించి 01–03–1983 నుంచి సదరు ప్రకటన ప్రభావం అమలులో ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాలి.
- రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించిన మొదటి తరగతి గెజిటెడ్ అధికారులకు కూడా స్థానికత అంశం వర్తింపు విషయమై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి సదరు ఉత్తర్వులను తగిన మార్పులు చేసేటట్లుగా చర్యలు తీసుకోవాలి.
- ఉపాధి కల్పనా కార్యాలయంలో బోగస్ రిజిస్ట్రేషన్స్ చేయించిన ఉద్యోగుల విషయమై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు సంబంధిత శాఖాధిపతుల ద్వారా తీసుకోవాలి.
- జోన్ 5, 6ల్లో గ్రామ సహాయకుల అక్రమ కేటాయింపులు జరిగి ఉంటే ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకుపోయి పరిష్కార మార్గాలను సుగమం చేయాలి. ఇలాంటి విషయమై టీఎన్జీవోల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలి.
- స్థానికులను వారి సొంత జోన్లలోని స్థానికేతర ఖాళీల్లో కేటాయింపు సాధ్యాసాధ్యాలు అనే అంశం ఏపీపీఎస్సీతో సంప్రదింపుల అనంతరం తప్పనిసరి అవసర పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాలి.
- హైదరాబాద్ నగర పరిధిలో పనిచేయుచున్న 1వ జోన్ నుంచి 4వ జోన్లకు చెందిన ప్రజారోగ్యశాఖ 13 మంది డీఈఈలను వారి జోన్లకు తిప్పి పంపే అంశం సంబంధిత శాఖ వారు రాష్ట్రపతి ఉత్తర్వు అనుసరించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి.
- రాష్ట్రపతి ఉత్తర్వులను న్యాయపరంగా అమలు చేయడానికి సచివాలయంలోని సంబంధిత శాఖలు న్యాయ శాఖను లేదా సాధారణ పరిపాలన శాఖను సంప్రదించి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలి.
సుందరేశన్ కమిటీ
ఎన్.టి.రామారావు ప్రభుత్వం జయభారత్‌రెడ్డి కమిటీ నివేదికలోని అంశాలను పరిరక్షించడానికి ఐఏఎస్ అధికారి సుందరేశన్ నేతృత్వంలో మరో కమిటీని నియమించింది. వాస్తవంగా తెలంగాణ ప్రాంతంలోని అధికారులు శాతం పరంగా చూస్తే ఐఏఎస్‌లు 8శాతం, ఐపీఎస్ 11శాతం, ఐఎఫ్ఎస్ 15శాతం, హైకోర్టు జడ్జీలు 25శాతం, సీటీఓలు 27శాతం, డిప్యూటీ సీటీఓలు 29శాతం సచివాలయంలో ఉద్యోగులు 9శాతం, గెజిటెడ్ ఆఫీసర్లు 17శాతం, ఉపాధ్యాయ ఉద్యోగులు 21శాతం, 23 జిల్లాల కలెక్టర్లలో ఒకరు మాత్రమే తెలంగాణ ప్రాంతం వారు ఉన్నారు. రాష్ట్రస్థాయిలోని 134 విభాగాల్లో 16శాతం మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. ఎవరూ అడ్వకేట్ జనరల్‌గా నియామకం కాలేదు. జయభారత్‌రెడ్డి, సుందరేశన్ కమిటీల సిఫారసుల ఆధారంగా 1985 డిసెంబర్ 30న జీవో 610ని విడుదల చేశారు.
610 జీవో అమలు తీరు
ఈ ఉత్తర్వు 1985లో జారీ చేసినప్పటికి దాని అమలు పూర్తిస్థాయిలో జరగలేదు. దీని కింద ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన వారు న్యాయస్థానాలను ఆశ్రయించి తమ ఉద్యోగ స్థానాల నుంచి కదల లేదు. నాటి ప్రభుత్వాలు 610 జీవో అమలు విషయంపై శ్రద్ధ వహించలేదు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ అధికారులు– సచివాలయ అధికారులు స్థానికేతరులకు అండగా నిలిచారు. స్థానికేతరులను బదిలీల నుంచి కాపాడడానికి కొన్ని పోస్టులను అప్‌గ్రేడ్ చేశారు.