ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని కొనుగోలు చేసేందుకు జయహో జహీరాబాద్ టీమ్​రెడీ

సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని కొనుగోలు చేసేందుకు ‘జయహో జహీరాబాద్’ టీమ్​రెడీ అవుతోంది. ఫ్యాక్టరీ యాజమాన్యం చెరుకు రైతులు, కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడంతో.. ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు రైతులే ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో సామాజిక ఉద్యమ నేత ఢిల్లీ వసంత ఆధ్వర్యంలో జయహో జహీరాబాద్ బృందం చేపట్టిన 72 గంటల సామూహిక దీక్ష గురువారంతో ముగిసింది. ‘మట్టి మనుషుల మనోగతం.. భూమి పుత్రుల ఆకలి కేక’ అంటూ ఈ నెల 4న జహీరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్​లో ఢిల్లీ వసంత్ ఆత్మీయ సమ్మేళనం మొదలుపెట్టగా, నియోజకవర్గ ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు. చెరుకు రైతుల పక్షాన పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు రూ.6 కోట్ల విలువైన షేర్​తీసుకునేందుకు ముందుకు వచ్చారు. 

ఢిల్లీ వసంత్ షుగర్ ఫ్యాక్టరీ కోసం తన వంతుగా కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. దళిత బంధు పథకం పైసలతో స్థానిక షుగర్ ఫ్యాక్టరీని జహీరాబాద్ రైతులు సొంతం చేసుకునేందుకు ఢిల్లీ వసంత్ ప్రతిపాదించారు. దీన్ని సీఎం కేసీఆర్ అమలు చేసి, ప్రభుత్వపరంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామాల వారీగా చైతన్యం తీసుకొచ్చి వారం రోజుల్లో సత్యాగ్రహం దీక్షలు మొదలుపెట్టనున్నారు. చెరుకు ఫ్యాక్టరీ ద్వారా రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సత్యాగ్రహంలో ప్రస్తావించనున్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

జహీరాబాద్ సమీపంలోని కొత్తూరు(బి) వద్ద ఉన్న ట్రైడెంట్​షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మెథడిస్ట్ చర్చ్ సూపరింటెండెంట్ రెవరెండ్ జాన్ వెస్లీ హామీ ఇచ్చారు. 72 గంటల సామూహిక దీక్షను సందర్శించిన వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్​రావు వివిధ గ్రామాల నుంచి సేకరించిన మట్టి నమూనాలను పరిశీలించి ఢిల్లీ వసంత్ బృందాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో బిల్లీపురం మాధవరెడ్డి, మహిపాల్ యాదవ్, కృష్ణయ్య, అశోక్ పాటిల్, విశాల్ గోడకే, గోవింద్ రెడ్డి, రహీమ్ ఖురేషి, మాదినం శివ, నారాయణ, శంకరయ్య, ఓంకార్, దినేశ్​, వెంకట్, ప్రశాంత్, సాయి రెడ్డి, మల్లికార్జున్, ముదిగొండ శ్రీనివాస్, భూమన్ స్టీవెన్సన్, విష్ణు, సుశాంత్, శ్రీకాంత్, సంగమేశ్ తదితరులు పాల్గొన్నారు.